తెలంగాణ ప్రభుత్వం రైజింగ్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఏమీ లేని ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి అక్కడ భవిష్యత్ లో మరో భారీ నగరం వస్తుందని చెప్పబోతున్నారు. అది వారి కాన్ఫిడెన్స్. కానీ ఆ సదస్సు నిర్వహణే కాస్త విచిత్రంగా మారుతోంది. ఇన్వెస్టర్లను పిలిచి.. వారితో సమావేశాలు పెట్టి.. పెట్టుబడుల అవకాశాలు వివరించి.. ఒప్పందాలు చేసుకోవడం కామన్. కానీ ఈ సమ్మిట్ రెండేళ్ల తమ పాలనా విజయాల ప్రచారానికి.. ఫ్యూచర్ సిటీ ప్రమోషన్‌కు.. ఉపయోగించుకుంటోంది. ఇంకా చెప్పాలంటే..దీన్ని పబ్లిక్ ఈవెంట్ చేసేశారు. ఉచిత బస్సులతో ప్రజల్ని తీసుకెళ్తున్నారు. కీరవాణి సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశారు. అందుకే ఇది ఆర్థిక సదస్సా కాదా అన్న డౌట్ ప్రజలకు వస్తోంది.దీనిపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇది పూర్తిగా ఆర్థిక సదస్సు అని పదే పదే చెప్పాల్సిన వస్తోంది. ల
ఇన్వెస్టర్ల కన్నా రాజకీయనేతలకు ఆహ్వానాలే ఎక్కువ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ఇన్వెస్టర్ల సమ్మిట్ గా చెప్పారు. కానీ రాను రాను అది.. పబ్లిక్ ఈవెంట్ గా మారిపోయింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా వస్తారని ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రకటిస్తారని అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఇండస్ట్రీస్ పెద్దలతో మాట్లాడి ఏమైనా ఖరారు చేసి పెట్టుకున్నారో లేదో కానీ.. ఏమైనా తేడా వస్తే మాత్రం చెడ్డపేరు వస్తుంది. ఎందుకంటే.. పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండాలని అనుకోరు. అయినా సరే.. ఆలోచించకుండా.. రాజకీయ నేతలందరికీ పెద్ద పీట వేస్తున్నారు. అందరు సీఎంలను పిలుస్తున్నా.. ఇండియా కూటమి నేతలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
సీఎం రేవంత్ తన విజన్ ప్రకారం సిద్ధం చేసుకున్న విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించబోతున్నారు. 2047 తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం ఓ విజన్ ను సిద్ధం చేసుకున్నారు. దాన్ని ఈ సదస్సులో ఆవిష్కరించనున్నారు. రేవంత్ ప్రత్యేక శ్రద్ధతో ఐఎస్బీ, నీతి అయోగ్ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని మరీ దీన్ని రూపొందించుకున్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తుందని.. సదస్సుకు రాకపోయినా.. పారిశ్రామిక రంగానికి ఓ ఆకర్షణశక్తిలా ఉపయోగపడుతుదంని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.
ప్రజలకూ సదస్సు దగ్గర చేసే వ్యూహం
నిజానికి ఇలాంటి సదస్సులు సామాన్య ప్రజలకు పట్టవు. అదేదో పెద్దోళ్ల వ్యవహారం అనుకుంటారు. కానీ అన్నీ ప్రజల కోసమే చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ ను కూడా ప్రజలకు దగ్గర చేయాలని రేవంత్ అనుకుంటున్నారు. లఅందుకే పబ్లిక్ కు అనుమతిస్తున్నారు. అయితే సదస్సు జరిగే రెండు రోజుల కాకుండా.. తర్వాత మూడు రోజుల పాటు అక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ మహా సమ్మిట్‌లో ప్రజలు రాష్ట్ర భవిష్యత్ ప్రాజెక్టులను చూడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తును చూడాలంటే డిసెంబర్ 10–13, ఫ్యూచర్ సిటీలో మీరు తప్పక ఉండాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.