కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు సీబీఐకి సిఫారసు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజు జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టుపై తెలంగాణ అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చించింది. కుట్రపూరితంగానే ఆదివారం సభ పెట్టారని, నివేదికను ఇచ్చిన వెంటనే చర్చ పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయినా ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసింది. ఏం చర్యలు తీసుకుంటారా అన్న దానిపై ఉత్కంఠ ఏర్పడింది. చివరికి సీబీఐకి సిఫారసు చేయాలని అసెంబ్లీ నిర్ణయించి వాయిదా పడింది.
సర్వం కేసీఆరేనని జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్
సభలో ప్రవేస పెట్టిన 635 పేజీల రిపోర్టులో కాళేశ్వరం విషయంలో జరిగిన ప్రతి తప్పిదానికి కేసీఆర్ దే బాధ్యతని తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల ఎంపిక వరకూ అంతా కేసీఆర్ కనుసన్నల్లో జరిగిందని.. ఎక్కడా సరైన నిబంధనలు పాటించలేదని జస్టిస్ ఘోష్ ఎత్తి చూపింది. కేసీఆర్ చెప్పినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా పని చేసిన పలువురు ఆఫీసర్లపైనా చర్యలకు జస్టిస్ ఘోష్ సిఫారసు చేశారు.
కుట్రపూరితమని వాదించిన బీఆర్ఎస్
జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టులో సభలో పూర్తి స్థాయిలో చర్చ జరగలేదు. బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా రిపోర్టును కుట్ర పూరితంగానే సభలో పెడుతున్నారని చెప్పడానికి ప్రయత్నించారు. రిపోర్టు ఇచ్చి అరగంటలో అంతా ప్రిపేర్ అయి చర్చలో పాల్గొనడం ఎలా సాధ్యమని హరీష్ రావు ప్రశ్నించారు. రిపోర్టులో ఉన్న ప్రతి పదానికి సమాధానం చెబుతామన్నారు. బీఆర్ఎస్ తరపున అత్యధికంగా హరీష్ రావుకే చాన్సిచ్చారు. హరీష్ రావు రిపోర్టు లోతుల్లోకి వెళ్లకుండా కేసీఆర్ పై కుట్ర చేసేందుకే ఈ నివేదిక అన్న వాదన వినిపించేందుకు ఆసక్తి చూపించారు.
కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న అధికార పార్టీ
జస్టిస్ ఘోష్ నివేదికపై పలు సందర్బాల్లో పలువురు అధికార పార్టీ ముఖ్యనేతలు మాట్లాడారు. అసెంబ్లీకి బిల్లును ప్రవేశ పెట్టడంపై హరీష్ చేసిన ఆరోపణలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. రిపోర్టులోని అంశాలపై కోమటిరెడ్డి కూడా అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో బిల్లును టేబుల్ చేసిన తర్వాత కేరళ వెళ్లారు. మళ్లీ ఆయన వచ్చిన తర్వాత.. మాట్లాడారు. అప్పటికి బీఆర్ఎస్ సభ్యులు , బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బురుద్దీన్ కొన్ని అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాటికి రేవంత్ సమాధానమిచ్చారు. కాళేశ్వరంలో జరిగిన తప్పులకు కేసీఆర్ ను ఉరి తీసిన తప్పు లేదని మండిపడ్డారు. చివరికి చర్యలు తీసుకునే విషయంలో సీబీఐకి సిఫారసు చేయాలని నిర్ణయించారు. దానికి సభ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ నిరవధిక వాయిదా
అసెంబ్లీని కేవలం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను సవరిస్తూ ఇవ్వాల్సిన జీవో కోసం చట్టసవరణ చేసేందుకు ఏర్పాటు చేసినట్లుగా ఉంది. ఒక రోజు సభ నిర్వహించి దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కు నివాళి అర్పించారు. ఆదవారం ఒక్క రోజే సభ నిర్వహించి.. బిల్లుల ఆమోదం.. జస్టిస్ ఘోష్ రిపోర్టుపై చర్చించారు. ఇంత హడావుడిగా ఎందుకు పూర్తి చేశారన్నది కాంగ్రెస్ వర్గాలకూ అంతు చిక్కడం లేదు.