పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం ముగిసిపోయే నాటికి మొత్తం ఇతర మున్సిపల్ సహా..గ్రేటర్ పాలక వర్గానికీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆలస్యమయ్యే కొద్దీ సమస్యలు వస్తాయని.. నిర్వహించేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లోని కాంగ్రెస్ నేతలకు..ఎన్నికలకు సిద్ధం కావాలని సమాచారం వెళ్లినట్లుగా చెబుతున్నారు.
మున్సిపాలిటీ కార్యవర్గాల పదవి కాలం ముగిసి ఏడాది
మున్సిపాలిటీల కార్యవర్గాల పదవి కాలం ముగిసి ఏడాది అవుతోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. ఫిబ్రవరి వరకూ గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు ఉంటుంది. చట్టబద్ధంగా గడువు ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ పరిపాలనాపరమైన కారణాల వల్ల నిర్ణయం తీసుకోలేదు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ప్రభుత్వం రాజకీయం చేయడంతో.. ఎన్నికల నిర్వహణ పెండింగ్ పడిపోయింది. ఆ అంశం తేలే అవకాశం లేకపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ ఎన్నికలునిర్వహించారు. ఇప్పుడు అదే పద్దతిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు.
గతంలో అధికార బీఆర్ఎస్ స్వీప్
తెలంగాణ రాష్ట్రంలో గత మున్సిపల్ ఎన్నికలు జనవరి 2020లో జరిగాయి. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 మున్సిపాలిటీలు , 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి అధికార పార్టీ అయిన భారత్ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేస్తూ దాదాపు 109 మున్సిపాలిటీలను, మొత్తం 9 కార్పొరేషన్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. కాంగ్రెస్, బిజెపి , ఎంఐఎం పార్టీలు స్వల్పంగా మున్సిపాలిటీలను దక్కించుకోగలిగాయి. కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపాలిటీల్లో మాత్రమే విజయం సాధించింది. బిజెపి ఆమనగల్ , తుక్కుగూడ వంటి 2 మున్సిపాలిటీల్లో జెండా పాతగా, ఎంఐఎం భైంసా , జల్పల్లి మున్సిపాలిటీలను గెలుచుకుంది. 2020లో కొలువుదీరిన ఈ మున్సిపల్ పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం జనవరి 2025 నాటికి ముగియనుంది.
ఇప్పుడు కాంగ్రెస్ వంతు
ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో మంచి ప్రభావం చూపించామని అనుకుంటున్నందున ఇక పట్టణాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా తగ్గలేదని నిరూపించాలని అనుకుంటున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. ప్రతిపక్ష బిఆర్ఎస్ తన పాత కోటలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు బిజెపి పట్టణ ప్రాంతాల్లో తనకున్న బలాన్ని ఓట్లుగా మలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే సమస్యలు వస్తాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే రేవంత్ ఎన్నికలు నిర్వహించేస్తాని నమ్మకంగా .. ఏర్పాట్లు ప్రారంభించుకున్నారు.
