రియల్ ఎస్టేట్ లో నమ్మకమైన వారి దగ్గరే లావాదేవీలు నిర్వహించడం అత్యవసరం లేకపోతే డబ్బులు ఎటు పోతాయో కూడా చెప్పడం కష్టం. కొంత మంది ప్లాట్లు అన్నీ అమ్మేసుకున్న తర్వాత అసలు పట్టించుకోవడం మానేస్తారు. కంప్లీట్ చేసి ఇవ్వరు. ఇలాంటి ఓ ప్రాజెక్టును నిర్మిస్తున్న కంపెనీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యకం చేసింది.
360 లైఫ్ పేరుతో శేరిలింగంపల్లి ఇజ్జత్‌నగర్‌లో 25 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ ను శ్రీముఖ్ నమితా హోమ్స్ అనే సంస్థ నిర్మిస్తోంది. ప్రాజెక్టు ప్రీ-లాంచ్ ఆఫర్లతో ఆరేళ్లక్రితం ఫ్లాట్లన్నీ అమ్ముకుంది. అయితే నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేకపోవడం, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరిగినందుకు జీహెచ్ఎంసీ మే 2025లో నోటీసు ఇచ్చింది. హైకోర్టు ప్రాజెక్టు నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని స్టే ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేకపోవడం, ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణం జరగడం వంటివి జరిగాయి హైకోర్టు నిర్దారించింది.
ఈ ప్రాజెక్టులో ప్లాట్ కొన్న విజయ్ కుమార్ ఎర్రం తనకు ఆర్థిక నష్టం చేశారని హైకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయడంతో ఈ తీర్పు వచ్చింది. ఈ ప్రాజెక్టు కస్టమర్లను మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. రంగురంగుల బ్రోషర్లు, ప్రీ-లాంచ్ ఆఫర్లతో కోట్లు సేకరించి, నిర్మాణానికి అనుమతులు లేకుండా పనులు చేపట్టారని తెలుస్తోంది. హైకోర్టు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని స్టే ఇచ్చింది.
ఇప్పుడీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వాళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇరుక్కుపోయారు. న్యాయవివాదాలు పరిష్కారమైనా తమ ప్లాట్ తమ చేతికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అందుకే ప్లాట్లు కొనుగోలు చేసే ముందు బిల్డర్లు రెప్యూటేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది.