కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువులోపు అంటే ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయింది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఇప్పటికే తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయింది. ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో ముందూ వెనుకాడుతోంది. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ.. రిజర్వేషన్ల వివాదం కారణంగా ముందుకెళ్లలేకపోతోంది. అధికారికంగా సాధ్యం కాదని.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉందని చెప్పుకున్నారు. అయితే చివరి క్షణంలో మరోసారి బిల్లును ఆమోదించారు. జీవో జారీ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాల్సి ఉంటుంది.
బీసీ రిజర్వేషన్ల అంశంతో స్థానిక ఎన్నికలను ముడిపెడితే అసలు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవని నిపుణులు అంటున్నారు. ఎంత ఆలస్యం అయితే ప్రభుత్వానికి అంత ఇబ్బంది అవుతుంది. అయినా ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ముందూ వెనుకాడుతోంది. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా పూర్తి చేసింది.