కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. గురువారం జరిగిన విచారణలో.. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా.. ముందే చర్యలు తీసుకుంటారా అన్నదానిపై క్లారిటీ కావాలని హైకోర్టు అడిగింది. శుక్రవారం జరిగిన విచారణలో అసెంబ్లీలో పెట్టిన తర్వాత చర్చించి.. నిర్ణయం తీసుకుంటారని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నివేదికలపై తదుపరి చర్యల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్, హరీష్ రావులకు ఊరట లభించనట్లు అయింది. ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ కాపీలు ఇస్తామని.. సమగ్రంగా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. శాసనసభలోనే బిల్లు పెట్టాలనుకుంటున్నందుకు ఈ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
జస్టిస్ ఘోష్ కమిషన్కు చట్టబద్ధత లేదనుకుంటే కేసీఆర్, హరీష్ రావు తమకు నోటీసులు జారీ చేసినప్పుడే హైకోర్టుకు వెళ్లాల్సిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కమిషన్ ముందుకు హాజరై తమ వాదనలు వినిపించిన తర్వాత.. రిపోర్టు వ్యతిరేకంగా వచ్చిందని.. ఆ రిపోర్టు చట్టబద్ధతపై ప్రశ్నించడం వ్యూహలోపమేనని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయినట్లే అనుకోవచ్చు.