తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జాతిపిత వివాదం నడుస్తోంది. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను నిలబెట్టేందుకు బీఆర్ఎస్ ప్రచార ఉద్యమం చేస్తోంది. తెలంగాణ జాతిపితకు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నిస్తోంది. దీనికి రేవంత్ రెడ్డి సెటైరికల్ గా కౌంటర్ ఇచ్చారు. ఆయన గాంధీ దేశం కోసం సర్వం త్యాగం చేయడం వల్ల ఆయనను ప్రజలు జాతిపితగా గుర్తుపెట్టుకున్నారని.. కానీ కేసీఆర్ ప్రజల్ని దోచుకుని వేల కోట్లు ఆస్తులు దోచుకుని, తెలంగాణని సొంత ఆస్తిలా భావించి పదవులన్నీ కుటుంబసభ్యులకు ఇచ్చుకున్నడాని అలాంటి వారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు. దీనికీ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. ఈ చర్చ ఇలా సాగుతుంది. కానీ కేసీఆర్ జాతిపిత అని ప్రచారం చేసుకోవడం మాత్రం ఎబ్బెట్టుగానే మారింది.
సామాన్య జనం హృదయాల నుంచి రావాలి !
తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని సామాన్య తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వస్తే..దాన్ని రేవంత్ కాదు కదా ఎవరూ ఆపలేరు. కానీ అలాంటి నినాదం అక్కడి నుంచి రాలేదు. బీఆర్ఎస్ చేయాలని అనుకుంటోది. కానీ ప్రజలు తమ జాతిపితగా భావించాలంటే.. వచ్చిన కొన్ని అవకాశాల్ని కేసీఆర్ వదిలేసుకున్నారు. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి … తెలంగాణ సాధించాక తాను , తన కుటుంబం అధికారం చేపట్టదని చేసిన ప్రకటనల వరకూ అన్నింటినీ మర్చిపోయారు. పదేళ్ల పాటు తెలంగాణ మొత్తాన్ని గుప్పిట పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబసభ్యులపై వచ్చాయి. ఇవన్నీ ఆయన ఇమేజ్ను దిగజార్చాయి.
తెలంగాణ క్రెడిట్ కేసీఆర్ ఒక్కరికే ఇవ్వడానికి సిద్ధంగా లేని సమాజం
తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పుకునే రోజుల్లో కూడా తెలంగాణ జాతిపిత అని ఎవరూ పిలవలేదు. తెలంగాణ సాధించిన క్రెడిట్ కూడా ఆయన ఒక్కరికే ఇవ్వడానికి సిద్ధపడలేదు. నిజానికి కేసీఆర్ తెలంగాణ కోసం ఉపఎన్నికల రాజకీయాలు చేశారు కానీ.. ఉద్యమం కోసం ఎప్పుడూ రోడ్డెక్కలేదు. రాజకీయ పోరాటాన్ని ప్రజలు గుర్తించారు. అధికారం ఇచ్చారు.కానీ తెలంగాణ ఆయన వల్లే వచ్చిందని మాత్రం.. తెలంగాణ ప్రజలు అనుకోవడం లేదు. ఆ విషయం తెలంగాణ వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో చాలా స్వల్పంగా అత్తెసరు మెజార్టీతో గెలవడమే కారణం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రావడం గగనంగా మారింది.
పదేళ్ల పాలన మరింత మైనస్
తెలంగాణ జాతిపితగా .. తెలంగాణ సమాజం గుర్తించేలా కేసీఆర్ వ్యవహారం లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ ఉద్యమ క్రెడిట్ అంతా ఆయన తీసుకునే ప్రయత్నం చేసినా.. కళ్ల ముందు లక్షల మంది ఉద్యమకారులు ఉండటంతో ప్రజలు కూడా అలా అనుకోవడంలేదు. అదే సమయంలో రేవంత్ చెప్పినట్లుగా ఉద్యమకారుల్ని కూడా ఆయన హయాంలో ఘోరమైన అవమానాలకు గురి చేశారు. ఎలా చూసినా .. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ రుద్దుతోంది కానీ.. ప్రజలు భావించడం లేదు. బీఆర్ఎస్ పితగా మాత్రం ఆయన స్థానం ఇప్పటికి బలంగా ఉంటుందని అనుకోవచ్చు. కాదు ఆయన తెలంగాణకే పిత అని రుద్దే ప్రయత్నం చేస్తే అది కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అయ్యే ప్రమాదం ఉంది.


