తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 30వ తేదీలోపు ఇవ్వాలని ఎస్ఈసీకి ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. ఈ మేరకు ఎస్ఈసీ కూడా ఏర్పాట్లు చేస్తోంది. అయితే రిజర్వేషన్ల జీవోపై విచారణలో హైకోర్టు.. చాలా స్పష్టంగా ఎన్నికలను వాయిదా వేసుకోవాలని సూచించింది. కోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదంటే వాయిదా వేసుకోవాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో న్యాయవ్యవస్థను ధిక్కరించే సాహసం ప్రభుత్వ పెద్దలు చేయరు. అందుకే.. నోటిఫికేషన్ రిలీజ్ ఆలోచన విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.
జీవో చెల్లకపోతే నోటిఫికేషన్ కూడా చెల్లదు!
రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోకు ఏ మాత్రం చట్టబద్ధత లేదు. ఆ విషయాన్ని కోర్టు ప్రాథమిక విచారణలోనే చెప్పలేదు కాబట్టి.. నోటిఫికేషన్లు ఇచ్చినా.. రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బిల్లులు, ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో జారీ చేయడం చెల్లదు. ఏ చట్టం ప్రకారం.. ఆ జీవో జారీ చేశారో హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అలాంటి ప్రతిపాదిక లేదు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా జీవోలు ఇవ్వలేరు. అందుకే కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతాయని ప్రభుత్వానికీ తెలుసు. అవే రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇస్తే… జీవో చెల్లదని హైకోర్టు చెబితే ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు.
రిజర్వేషన్ల వివాదాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటున్న కాంగ్రెస్
ఏ రాజకీయ పార్టీ అయినా .. రిజర్వేషన్లతో రాజకీయం చేస్తే చివరికి బూమరాంగ్ అవుతుంది. గతంలో టీడీపీ.. బీఆర్ఎస్ పార్టీలకు అదేపరిస్థితి వచ్చింది. అయినా కాంగ్రెస్ .. రిజర్వేషన్లతోనే రాజకీయం చేస్తోంది. ఢిల్లీలో ధర్నా చేసిన రేవంత్..రాహుల్ ను ప్రధానిని చేసుకుని బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఆ విధానానికి కట్టుబడి రాజకీయ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లినట్లయితే.. సరిపోయేది. కానీ ఇప్పుడు జీవోల పేరుతో కొత్త రాజకీయం చేస్తున్నారు. దీని వల్ల వివాదం ముదిరి సమస్యలు పెరుగుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.
ప్రస్తుతానికి వాయిదాకే మొగ్గు?
కావాలంటే మరో మూడు నెలల పొడిగింపు అడగాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహిస్తామని స్వయంగా ప్రభుత్వమే హైకోర్టుకు చెప్పి గడువు తీసుకుంది. ఇప్పుడు మళ్లీ గడువు అడిగలేకపోయింది. రిజర్వేషన్ల జీవో ఇచ్చింది. హైకోర్టు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుందేమో కానీ మరో మూడు నెలల గడువు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఈ సలహాను పాటించాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్న రేవంత్ సర్కార్.. వాయిదాకు సిద్ధమని తదుపరి విచారణలో చెప్పే అవకాశం ఉంది.