తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీతో సహా ఏ ఒక్క పార్టీలోనూ ఈ ఎన్నికలు జరుగుతాయని నామినేషన్ల వరకూ వెళ్తాయని.. వెళ్లినా ప్రక్రియ పూర్తి అవుతుందని నమ్మలేకపోతున్నారు. అందుకే ఎక్కడా హడావుడి కనిపించడం లేదు. ముఖ్య నేతలు తమ క్యాడర్ కు కంగారు పడి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.
బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసేవారు దావత్ల పేరుతో ఇప్పుడే ఖర్చు పెట్టుకోవద్దని ఆ ఎన్నికలు జరగవని.. జరిగినా చెల్లవని చెబుతున్నారు. దీనికి కారణంగా రిజర్వేషన్ల జీవో ఆధారంగా షెడ్యూల్ రిలీజ్ చేయడమే. ఆ రిజర్వేషన్ల జీవో చెల్లదని న్యాయపరమైన లొసుగులు పెట్టి.. ఎలాగోలా ఎన్నికలు నిర్వహించినా తర్వాత రద్దు అవుతాయని అంటున్నారు. మహారాష్ట్రలో అలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సహజంగా స్థానిక ఎన్నికలు అంటే పోటీ కోసం నేతలు పోటీ పడాలి. కానీ పేర్లు పంపించాలని.. గాంధీభవన్ సూచించాల్సి వస్తోంది. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నిజంగా ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకం వారిలోనూ కలగకపోవడమే దీనికి కారణం. రిజర్వేషన్ల వివాదాన్ని ఇలా ఎన్నికలకు ముడిపెట్టాలని సీఎం రేవంత్ ఎందుకు అనుకున్నారో కానీ.. ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్తుందని ఎవరికీ నమ్మకం లేకుండా పోయింది.