స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ధైర్యంగా ఎలాంటి అడుగులు వేయలేకపోతోంది. సుప్రీంకోర్టు కూడా 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ఎలాంటి అంశంపైనా స్పష్టతకు రాలేకపోతున్నారు. హైకోర్టులో జరుగుతున్న విచారణలో మళ్లీ మళ్లీ వాయిదాలు కోరుతున్నారు.
ఎన్నికలపై బెంచ్‌కు తమ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత గడువు కోరింది. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం మాత్రం హైకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం గడువు కోరినందున తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాలను బట్టి రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం ఉంది.
ఫలితం తేడా వస్తే కాంగ్రెస్.. ఎన్నికలను మరింత ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఫలితం అనుకూలంగా వస్తే.. మాత్రం దూకుడుగా.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు త్వరగానే వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల పార్టీకి చాలా సమస్యలు వస్తున్నాయి. ఎంత ఆలస్యమైతే అన్ని ఇబ్బందులు అని నాయకత్వానికీ స్పష్టత రావడంతో.. నాయకత్వం కూడా సీరియస్ గానే ఎన్నికల నిర్వహణపై ఆలోచిస్తోంది.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              