తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసినా పెద్దగా హడావుడి కనిపించడం లేదు. దీనికి కారణం రిజర్వేషన్ల జీవో చెల్లుబాటు కాదని.. ఆ జీవో ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లతో వచ్చిన నోటిఫికేషన్ కూడా న్యాయపరిశీలనలో నిలబడదని ఎక్కువ మంది గట్టిగా నమ్ముతున్నారు. ప్రభుత్వానికి ఈ అంశంలో స్పష్టత ఉంది. అందుకే షెడ్యూల్ లో మొదటి విడతకు నోటిఫికేషన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించారు. ఎనిమిదో తేదీన హైకోర్టులో జీవోపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగనుంది.
రిజర్వేషన్ల జీవోపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కోర్టుల జోక్యం ఉండకూడదనుకుంటే నోటిఫికేషన్ విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. అందుకే విచారణలోపు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఎనిమిదో తేదీన విచారణలో కోర్టు ఏం చెబుతుందన్నదానిపై తదుపరి కార్యాచరణను ప్రభుత్వం, ఎస్ఈసీ ఖరారు చేసే అవకాశం ఉంది. జీవో విషయం హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసి.. ఆ జీవోపై స్టే ఇస్తే మాత్రం మళ్లీ ఎస్ఈసీ .. రీషెడ్యూల్ చేయాల్సిందే. దాని కోసం కూడా ఎస్ఈసీ ఇప్పటికే రెడీ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
స్థానిక ఎన్నికల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రిస్క్ తీసుకుంటోంది. ఎలాగైనా జీవో ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అధికారికంగా ఇవ్వాలనుకోవడం వల్లనే ఇలాంటి పట్టుదలకు పోతోంది. న్యాయకోవిదులు సలహాలు ఇవ్వరా అంటే.. రాజకీయంగానే ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే స్థానిక ఎన్నికలపై కోర్టుల్లో పిటిషన్లు ఉన్నంత కాలం ఎవరికీ నమ్మకం ఉండటం లేదు.