తెలంగాణలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. గణపతి కూడా లొంగిపోతారని ప్రచారం జరుగుతోంది. ఇతర చోట్ల కాకుండా తెలంగాణలో లొంగిపోవడానికి కారణం.. భద్రతకు భరోసా, ఆర్థిక సాయం ప్రకటనే. తమ దగ్గర లొంగిపోయిన వారందరికీ పరిహారం, ఇల్లు, ఉపాధి వంటివి చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సాయాల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యువ నక్సలైట్లను సరైన దారిలోకి తేగలరా?
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రకటించే తక్షణ ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు వృద్ధాప్యంలో ఉన్న మాజీ నక్సలైట్లకు ఒక ఆసరాగా నిలుస్తాయేమో కానీ, 20-25 ఏళ్ల యువ గిరిజనులకు అవి ఏమాత్రం సరిపోవు. తుపాకీ పట్టిన చేతులకు పని దొరకనప్పుడు, సమాజంలో గుర్తింపు లభించనప్పుడు వారు మళ్లీ అసాంఘిక శక్తుల వైపు మళ్లే ప్రమాదం ఉంది. గతంలో నయీం వంటి వారు వ్యవస్థలోని లోపాలను వాడుకుని గ్యాంగ్స్టర్లుగా ఎలా మారారో మనం చూశాం. కేవలం నగదు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించకపోతే, ఈ పునరావాస పాలసీలు తాత్కాలిక ఉపశమనాలుగానే మిగిలిపోతాయన్న అభిప్రాయం ఉంది.
భూమి ఇవ్వలేరు.. చట్టపరమైన చిక్కులు
లొంగిపోయిన వారు పాత జీవితాన్ని వదిలి నిజాయితీగా బతకాలంటే వారికి శాశ్వత ఆదాయ వనరు ఉండాలి. అందువల్ల వారు భూమిని కోరుకుంటున్నారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి భూమి ఇవ్వడం అనేది ఒక వివాదాస్పద నిర్ణయం అవుతుంది. సీఎం రేవంత్ కూడా అదే చెబుతున్నారు. ఇది ఒకవైపు సామాన్యులకు అందనప్పుడు, ఆయుధాలు పట్టిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తిని ప్రజల్లో కలిగిస్తుంది. మరోవైపు, భూమి ఇవ్వకపోతే వారు మళ్లీ అడవి బాట పట్టే లేదా నేరాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో సిఎం ఉదారంగా వ్యవహరించాలనుకున్నా సాధ్యం కాని పరిస్థితి. అందుకే నేరుగా నక్సలైట్లకే రేవంత్.. భూమి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు.
వారిని కనిపెట్టుకుని సన్మార్గంలో ప్రయాణించేలా చేయాలి!
తెలంగాణలో లొంగిపోయిన వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు. టాప్ లీడర్లు తప్ప క్యాడర్ అంతా ఛత్తీస్‌ఘడ్‌కు చెందినవారే. సొంత రాష్ట్రంలో భద్రత లేకపోవడం లేదా అక్కడి కఠిన పరిస్థితుల వల్ల వారు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థపై ఉన్న నమ్మకం ఒక కారణమైతే, ఇక్కడ లభించే ప్యాకేజీ మరొక కారణం. అయితే, వీరికి సరైన మార్గదర్శకత్వం లేకపోతే, వీరు స్థానిక నేరగాళ్లకు బాడీగార్డ్స్ గా లేదా సెటిల్మెంట్ దందాలకు సాధనాలుగా మారే ముప్పు పొంచి ఉంది. చదువు రాని ఈ గిరిజన యువతను కేవలం గణాంకాల కోసం లొంగిపోయిన వారిగా చూపడం కాకుండా, వారిని పౌర సమాజంలో ఎలా విలీనం చేస్తారనేదే అసలైన సవాలు. గాలికి వదిలేస్తే గ్యాంగ్స్టర్లు.. హత్తుకుంటే పౌరులు అనే సూత్రాన్ని ప్రభుత్వం ఎంత చాకచక్యంగా అమలు చేస్తుందనే దానిపైనే నక్సలిజం అంతం ఆధారపడి ఉంటుంది.
