తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. రియల్టర్ల నుంచి లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎమ్మెల్యే ప్లస్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి… ఓ వెంచర్ విషయంలో రియల్టర్‌ని బెదిరించారు. ఇప్పటికే సర్పంచ్‌కు ముడుపులు సమర్పించుకున్నానని చెప్పిన రియల్టర్‌కు.. తనకు.. మరో ఎమ్మెల్యేకు కూడా ఇచ్చే వరకూ వెంచర్ ఆపేయాలని హుకుం జారీ చేశారు. ఈ ఆడియో వెలుగులోకి రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మల్లారెడ్డి ఓ రకంగా అపరకుబేరుడు. ఆయన తన జీవితాన్ని పాలు పోసుకుంటూ ప్రారంభించినా… ఇంజినీరింగ్ కాలేజీలు.. మెడికల్ కాలేజీలతో విద్యా వ్యాపారం చేసి .. వేల కోట్లు సంపాదించారు. హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వందల కోట్లు విలువ చేసే భూములు ఉంటాయి.
అయినప్పటికీ.. ఆయన ఇలా చిన్నా చితకా రియల్టర్లను లంచం కోసం డిమాండ్ చేయడం… అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అయితే ఆ ఆడియోటేప్ తనది కాదని.. మిమిక్రి చేసేవాళ్లు ఎక్కువయ్యారంటూ మల్లారెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దుమారం మాత్రం ఆగడం లేదు. మల్లారెడ్డిపై ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఓ మహిళ .. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ న్యాయపోరాటం చేసింది. మల్లారెడ్డిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది కూడా. ఇప్పుడు… రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ముడుపుల కోసం.. డిమాండ్ చేస్తూ దొరికిపోయారు.
ఇప్పటికే… అనేక వివాదాలతో కేసీఆర్‌కు మల్లారెడ్డి తలనొప్పులు తీసుకు వచ్చారు. ఇప్పుడు.. ఆయనను ఇక భరించడం సాధ్యం కాద్నన భావనలోకి టీఆర్ఎస్ అధినేత వచ్చేలా వ్యవహారశైలి ఉందంటున్నారు. మంత్రివర్గ పున్‌వ్యవస్థీకరణ అంటూ జరిగితే… మల్లారెడ్డి మంత్రి పదవి ఊస్టింగ్ ఖాయమని ఇప్పటికే ప్రచారం ప్రారంభమయింది.