తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 నుండి 2014 వరకు సాగిన సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న నిజమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అమరవీరుల స్మారక చిహ్నం అమరజ్యోతి వేదికగా కీలక సమావేశం నిర్వహించింది. జూన్ 23వ తేదీ నుంచి రాజకీయాలకు అతీతంగా, పూర్తి పారదర్శకంగా దశలవారీ సంప్రదింపులు జరుపుతామని కమిటీ ప్రకటించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వినడానికి ఎంత ఆదర్శవంతంగా ఉన్నప్పటికీ.. ప్రాక్టికల్‌గా చూస్తే ఇది కత్తి మీద సాము లాంటి అత్యంత సంక్లిష్టమైన వ్యవహారం.
ప్రాణార్పణం చేసిన వారిని గుర్తించడం ఎలా?
ఈ కసరత్తులో ఎదురయ్యే మొదటి , అతిపెద్ద సవాలు.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సంఖ్యపై ఉన్న స్పష్టమైన భేదాభిప్రాయాలు. ఉద్యమ కాలంలో సుమారు 1,200 నుండి 1,400 మంది వరకు యువకులు, విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని వివిధ సంఘాలు, నాటి ఉద్యమ పార్టీలు ఒక రకమైన లెక్కను చెబుతూ వచ్చాయి. కానీ, గత పదేళ్ల ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా గుర్తింపు పొంది, సహాయం అందిన వారి సంఖ్య దానికి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కేశవరావు కమిటీ ఈ అమరవీరుల కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని భావిస్తున్న తరుణంలో.. నాటి క్షేత్రస్థాయి మరణాల డేటాను సేకరించడం, వాటిలో నిజమైన త్యాగాలను వేరు చేయడం ఒక హిమాలయ పర్వతాన్ని అధిరోహించడంతో సమానమని చెప్పవచ్చు.
ప్రజలందరూ ఉద్యమకారులైన ఉద్యమం
రెండోది, మలిదశ తెలంగాణ ఉద్యమ రూపం, దాని స్వభావం. 2009 నుండి 2014 మధ్య కాలంలో తెలంగాణలో ఉద్యమం అనేది కేవలం ఒక పార్టీకో లేదా కొన్ని సంఘాలకో పరిమితం కాలేదు. అది ఒక ప్రజా ఉద్యమం గా మారి, కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. సకల జనుల సమ్మె, వంటా-వార్పు, మిలియన్ మార్చ్, రైల్ రోకో వంటి కార్యక్రమాల్లో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పౌరుడూ ఒక ఉద్యమకారుడే. మరి ఇలాంటి ప్రజాపోరాటంలో.. ఈయన ఉద్యమకారుడు, ఈయన కాదు అని కేవలం జైలుకు వెళ్లిన వారినో, కేసులు నమోదైన వారినో మాత్రమే ప్రామాణికంగా తీసుకుని సరిహద్దు గీతలు గీయడం ఎంతవరకు సాధ్యమనేది పెద్ద ప్రశ్న.
రాజకీయంగానూ రిస్కే
ఈ క్లిష్టమైన బాధ్యతను నెత్తిన పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ రిస్క్ ను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక క్రైటీరియాను నిర్దేశించి కమిటీ ఒక జాబితాను రూపొందిస్తే.. అందులో చోటు దక్కని వేలాది మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు, నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే ప్రమాదం ఉంది. తాము లాఠీ దెబ్బలు తిన్నామని, చదువులు పాడుచేసుకున్నామని, అయినా తమను గుర్తించలేదనే ఆగ్రహం వారిలో వ్యక్తమైతే.. అది లబ్ధి కంటే ప్రభుత్వానికి ఎక్కువ నెగిటివిటీని తెచ్చిపెడుతుంది. అర్హులైన వారందరికీ పెన్షన్లు, గౌరవ వేతనాలు లేదా ప్రభుత్వ సదుపాయాలు కల్పించడం ఆర్థికంగా కూడా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం కానుంది.
అందర్నీ సంతృప్తి పరిచే ఫార్ములానే కీలకం
కేవలం కేసులు, అరెైస్ట్లను మాత్రమే కాకుండా జేఏసీల సిఫార్సులు, నాటి నిరసనల ఆధారాలను అత్యంత శాస్త్రీయంగా పరిశీలించాల్సి ఉంటుంది. కేశవరావుతో పాటు ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్ వంటి ఉద్యమ మూలాలున్న నేతలు ఈ కమిటీలో ఉన్నందున వీరు ఎలాంటి ఫార్ములాను తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ గుర్తింపు ప్రక్రియలో గనుక చిన్న పొరపాటు జరిగినా లేదా పక్షపాతం దొర్లినా.. తెలంగాణ సెంటిమెంట్‌కు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి, ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దావాగ్నిని రగల్చడం ఖాయం.
