తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రచారదశకు వచ్చాయి. మరో వారంలోనే పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచార పర్వంలో మునిగిపోయాయి. ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. దక్షిణ తెలంగాణలో పరిస్థితి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి, పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
భిన్నంగా ఉత్తర తెలంగాణ మున్సిపల్ సమీకరణాలు
ఉత్తర తెలంగాణలో ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. వీటితో పాటు అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల వంటి సుమారు 35-40 మున్సిపాలిటీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నుంచి బీజేపీ ఇక్కడ బలంగా పుంజుకుంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో కమలం పార్టీకి బలమైన కేడర్ ఉండటం, హిందుత్వ అజెండా , కేంద్ర పథకాల ప్రచారం బీజేపీకి కలిసొచ్చే అంశాలు. దీంతో చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు సాగుతోంది.
రేవంత్ రెడ్డి ఉత్తర ఆపరేషన్
బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ నేతలతో వరుస భేటీలు జరిపిన ఆయన, ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆదేశించారు. బీజేపీ మతపరమైన అంశాలతో ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని భావిస్తున్న సీఎం, అభివృద్ధి మంత్రంతో ఆ పార్టీని కట్టడి చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?
గతంలో ఈ ప్రాంతాన్ని శాసించిన బీఆర్ఎస్ ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా నాయకులు పార్టీని వీడటం, కేడర్‌లో నైరాశ్యం నెలకొనడం గులాబీ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. అయితే, సిరిసిల్ల, సిద్ధపేట వంటి కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ ప్రభావంతో ఇప్పటికీ బీఆర్ఎస్ గట్టిగా ఉంది. ముక్కోణపు పోటీ జరిగే చోట బీఆర్ఎస్ చీల్చే ఓట్లు ఎవరికి లాభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోరు సాగుతుండటంతో బీఆర్ఎస్ సైలెంట్ ఓటింగ్ ను నమ్ముకుంది.
