తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సరళి, గతంతో పోలిస్తే గణనీయమైన మార్పును సూచిస్తోంది. ముఖ్యంగా ఏకగ్రీవాల పేరిట జరిగే రాజకీయ దౌర్జన్యాలకు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేసింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే భయం, బెదిరింపులు, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం వంటి వార్తలు నిత్యకృత్యంగా ఉండేవి. అధికార పార్టీ నేతలు తమ బలాన్ని ఉపయోగించి ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం ద్వారా వందల సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకునే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు ఎవర్నీ బెదిరించలేదు. ఎవరూ నామినేషన్లు వేయకుండా ఆగిపోలేదు. అంతా ప్రశాంతంగాఎన్నికల బరిలో నిలబడ్డారు.
గతంలో ఏకగ్రీవాలు ఎక్కువ
కేసీఆర్ హయాంలోనూ మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించడానికి అన్ని రకాల అప్రజస్వామ్య పద్దతుల్ని పాటించారు. ఏకగ్రీవాల దగ్గర నుంచి ఇతర పార్టీలకు చెందిన బలమైన అభ్యర్థులు నిలబడకుండా చేయడం వరకూ చాలా చేసారు. అయితే, ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 12 వార్డులు మాత్రమే ఏకగ్రీవం కావడం, అందులోనూ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా రెండు స్థానాలను గెలుచుకోవడం.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పడానికి నిదర్శనం.
జగన్ నుంచి ఏమీ నేర్చుకోని రేవంత్
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు హక్కును కాలరాస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ 2021 మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అప్పట్లో జగన్ సర్కార్ హయాంలో ఏకంగా 578 వార్డులు ఏకగ్రీవమయ్యాయి, అందులో 570 వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. ఇలా బలవంతంగా ప్రజాభిప్రాయాన్ని తొక్కిపెట్టడం వల్ల ప్రజల్లో వ్యక్తమైన నిశ్శబ్ద ఆగ్రహమే ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రజలు తమకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కోల్పోయినప్పుడు, ఆ అసంతృప్తిని ఓటు రూపంలో చూపిస్తారనే సత్యాన్ని రేవంత్ రెడ్డి గుర్తించినట్లు కనిపిస్తోంది.
ప్రజాస్వామ్య విలువలకు రేవంత్ పెద్దపీట
రాజకీయాల్లో గెలుపు కంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం ముఖ్యమని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తన అధికారాన్ని ఉపయోగించి వందల సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకోవడం ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఓటర్లకు వారి ఓటు హక్కును గౌరవించే అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నారు. ప్రజలు ఓట్లేస్తేనే రాజకీయం అనే సూత్రాన్ని నమ్ముతూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అభివృద్ధి , ప్రజా సేవపై చర్చకు వేదికయ్యాయి తప్ప, లాఠీలు, బెదిరింపులకు కాదు. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల సరళి భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలకు ఒక దిక్సూచిగా మారనుంది. ఇది తెలంగాణ ప్రజాస్వామ్యం బలోపేతానికి ఉపయోగపడుతుంది.


