మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిపోయింది. రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ రావడమే మిగిలింది. దీనికి ప్రిపరేషన్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం 90శాతం వార్డుల్లో గెలవాలని టార్గెట్ గా పెట్టుకుని .. పార్టీ నేతలకు బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల వారీగా మున్సిపాలిటీలను ఎంపిక చేసి టార్గెట్లు ఫిక్స్ చేసి నేతలను పనిలోకి దించారు. తాను కూడా ప్రచార బరిలోకి దిగారు.
మున్సిపల్ ఎలక్షన్ గ్రౌండ్లో రేవంత్ పరుగులు
కాంగ్రెస్ వైపు నుంచి చాలా సీరియస్ గా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ భారత రాష్ట్ర సమితి వ్యవహారమే తేడాగా ఉంది. ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల కార్యచరణ అసలు హైకమాండ్ స్థాయిలో ఏమీ లేదు. నియోజకవర్గాల బాధ్యులుగా ఉన్న వాళ్లు మాత్రమే బాధ్యత తీసుకోవాలన్నట్లుగా వదిలేశారు. ఫలితంగా చాలా మంది పైపైన మున్సిపల్ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు. పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉండటం.. స్థానిక క్యాడర్ ను పార్టీ తరపున బరిలోకి దించితే ఖర్చు అంతా తామే పెట్టుకోవాలని ఎక్కువ మంది బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు. వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ క్యాడర్ కే వదిలేస్తున్న బీఆర్ఎస్
వీరందర్నీ మోటివేట్ చేసి.. ఖర్చుకు వెనుకాడకుండా గౌరవప్రదమైన స్థానాలు గెలిచేలా చూసుకోవాలని కార్యోన్ముఖుల్ని చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వానికి తీరిక లేకుండా పోయింది. కేటీఆర్ సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ వారిని అభినందించే సమావేశాలకు జిల్లాలకు వెళ్తున్నారు. కానీ మున్సిపల్ పోరుపై అంత దృష్టి పెట్టలేదు. కేసీఆర్ ఎప్పుడో ఓ సారి వచ్చి మాట్లాడి పోవడం వల్ల లాభం కంటే నష్టమే జరుగుతోంది. నీళ్ల పంచాయతీని పెట్టాలనుకుని ప్రయత్నించారు. కానీ వారు రాజేసిన మంటను పెద్దది చేయడానికి వారికి తీరిక లేకుండా పోయింది. ఆ మంటను ఆర్పడమే కాకుండా.. రివర్స్ లో బీఆర్ఎస్కే సెగ తగిలేలా చేస్తున్నారు రేవంత్.
గౌరవప్రదమైన స్థానాలు గెలవకపోతే కష్టమే !
సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఎవరు గెలిచినా మా పార్టీ సానుభూతిపరులని చెప్పుకునేందుకు చాన్స్ ఉంటుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి అవకాశం ఉండదు. ఈ సారి వచ్చే ఫలితాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకే బీఆర్ఎస్ ..పంచాయతీల్లో తాము కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకున్నట్లుగా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఆ పార్టీ అనేక రకాల సమస్యలతో .. మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టలేకపోతోంది. లోకల్ క్యాడర్ కే వదిలేస్తోంది. ఇది ఆ పార్టీకి సమస్యలు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
