తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చేసి కొత్త సముదాయాన్ని నిర్మించాలనే కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు సవాల్ చేశారు. నిక్షేపంలాంటి భవనాలను వాస్తు పేరుతో కూల్చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్నివిమర్శిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కొత్త సచివాలయం విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రో్జు నుంచీ విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాయి. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడున్న భవనాలు కూలిపోయే దశకు చేరలేదు. కచ్చితంగా కొన్ని దశాబ్దాల పాటు ఉపయోగపడే పటిష్టమైన భవనాలే. వాస్తు పేరుతో ఉన్న వాటిని కూల్చడంపై ప్రజల్లోనూ వ్యతిరేకత కనిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి.
పదిరోజుల్లో సచివాలయాన్ని ఖాళీ చేయించడానికి ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో విషయం హైకోర్టుకు చేరింది. దీనిపై కోర్టు స్పందన ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తాము లేవనెత్తిన అంశాలను కోర్టు పరిగణన లోకి తీసుకుంటుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. తెరాస నేతలు మాత్రం ప్రజల ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయానికి అడ్డుతగలడం మంచిది కాదని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు.
వాస్తు విషయంలో ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నాస్త్రాలకు కేసీఆర్ ప్రభుత్వం జవాబు చెప్పలేదు. వాస్తు బాగా లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చిందని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కు సీఎం పదవి, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు ఎలా వచ్చాయని కూడా ఆయన ప్రశ్నించారు.
పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వడానికి బదులు కొత్త సచివాలయాన్ని నిర్మించడం ఏం నిర్ణయమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. గత ఏడాది హైదరాబాద్ ఐ డి హెచ్ కాలనీలో 396 డబుల్ బెడ్ రూపం ఇళ్ల కాంప్లెక్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఇంత వరకూ ఒక్క పక్కా ఇల్లు కూడా కట్టింది లేదని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం కొత్త సచివాలయం ప్రజల కోసమే అంటోంది. చివరికి ఎవరి వాదన ఎలా ఉన్నా హైకోర్టు చెప్పేదే ఫైనల్.