పారిశ్రామిక సేవా రంగాల్లో ముందున్న తెలంగాణ వ్యవసాయ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల్లో టాప్-2గా నిలిచింది. వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండోస్థానం తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. నాణ్యమైన, నమ్మకమైన ఉత్పాదకత, ఉత్పత్తుల తయారీ రంగంలోనూ ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి ఎదిగింది. కేంద్ర ప్రభుత్వం ” వ్యవసాయ రంగం – ఉత్పత్తుల ఎగుమతులు” అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడయింది.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల శాతం ఒక్కసారిగా 40శాతానికి పెరిగి, రూ.10వేల కోట్ల మార్కును దాటింది. ఇంతలా సాగు పెరగడానికి రైతులు కూడా సాంకేతికత పద్ధతులను వినియోగించడమే కారణమని భావిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వ్యాపార లావాదేవీలు 2017-18 నుంచి 2021-22 వరకు తెలంగాణలో రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెరిగాయి.తెలంగాణ ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, పత్తి, మాంసం తదితర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. వినూత్న పద్ధతులు, సాంకేతికతను వేగంగా ఉపయోగించడం, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల కారణంగా తెలంగాణ నుండి ఎగుమతులు పెరిగినట్లు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి మొక్కజొన్న, బియ్యం, ద్రాక్ష, నిమ్మ, మామిడి, సోయాబీన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో తెలంగాణ వాటా ఎక్కువగా ఉందని గణాంకాల ప్రకారం తెలుస్తుంది. 2019-2021 మధ్యకాలంలో రాష్ట్రం రూ.3,000 కోట్ల విలువైన ఎఫ్డిఐని ఆకర్షించింది. ప్రస్తుతం రాష్ట్రం నూనె గింజల సాగు విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత .. సాధించిన కీలకమైనమార్పుల్లో ఇది ఒకటి ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.