తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజేతగా నిలిచింది. 12వేలకుపైగా పంచాయతీల్లో సర్పంచ్ పదవులు, వార్డు సభ్యుల పదవుల కోసం ఎన్నికలు జరిగాయి. అనేక సవాళ్ల మధ్య కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు సాధించింది. 55 శాతం వరకూ పంచాయతీల్లో అంటే దాదాపుగా 7వేలకుపైగా పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. మరో ఆరేడు వందల పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలిచారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ..కాంగ్రెస్ సాధించిన పంచాయతీల్లో సగం సాధించింది. బీజేపీ మరీ తీసికట్టుగా ఏమీ లేదు. పర్వాలేదనుకునే స్థాయిలోనే పంచాయతీలను సాధించింది. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ విన్నర్ గా నిలిచింది.
కాంగ్రెస్ పార్టీకి మరింత భరోసా
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో వచ్చిన విజయంతో ధైర్యం తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలను వెంటనే నిర్వహించేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం పెద్దగా ఎన్నికల్లో టాపిక్ కాకుండా ఎన్నికలు జరిపించేసింది. నిజానికి స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే నిర్వహిస్తామని గతంలో వాగ్దానాలు చేశారు. అలాంటి అవకాశం లేదని తేలడంతో కోర్టుకు ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. భారీగా అధికార వ్యతిరేకత ఉందని జరిగిన ప్రచారం మాత్రమే కాదు.. యూరియా సమస్య సహా చాలా అంశాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. పొరపాటున గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ పంచాయతీలు సాధిస్తే అది భవిష్యత్ లో చాలా ఇబ్బందికరం అయ్యేది . కానీ కాంగ్రెస్ ఆ గండాన్ని గట్టెక్కింది.
గట్టిగా పోరాడిన బీఆర్ఎస్
భారత రాష్ట్ర సమితి క్యాడర్ చేతులు ఎత్తేయకపోవడం ఆ పార్టీ పెద్దల్ని సంతృప్తి పరిచిందని అనుకోవాలి. అధికారంలో లేకపోతే పనులు చేయించుకోలేమన్న కారణం చెప్పి బలమైన గ్రామ స్థాయి నేతలంతా పార్టీ మారిపోయి ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరువు పోయేది. కానీ మెజార్టీ నేతలు పార్టీ మారలేదు. గ్రామాల్లో రెండు వర్గాలు బలంగా ఉండటం దీనికి కారణం. ఇలాంటి పరిస్థితితో బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టిగా పోరాడారు. బలమైన నేతలు ఉన్న చోట.. బీఆర్ఎస్ నేతలు తమ సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థికంగా కూడా సాయం అందించారు. ఇది కలసి వచ్చింది. ఎలా చూసినా.. భారత రాష్ట్ర సమితి జావ కారిపోలేదు. గట్టిగానే పోరాడి నిలబడింది. ఇది రాబోయే రోజుల్లో పోరాటానికి సరిపోతుంది.
బీజేపీ గతం కంటే చాలా బెటర్
గ్రామ స్థాయిలో ఎప్పుడూ బలంగా లేని బీజేపీ ఈ సారి కొన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు చూపించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఉన్న నిర్మల్ జిల్లాలో ఇతర పార్టీల కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ వంటి చోట్ల ఏకపక్షంగా కాకపోయినా కొన్ని మంచి ఫలితాలు సాధించారు. ఐదారు వందల పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు అయిన సర్పంచ్ల విజయం సాధించారంటే చిన్న విషయం కాదు. కానీ బీజేపీ ఇచ్చుకున్న హైప్‌కు.. ఆ తర్వాత వచ్చిన ఫలితాలకు మాత్రం పొంతన లేదు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలోనూ విజేతగా నిలిచింది. రెండేళ్ల పాలన తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఆ పార్టీ నాయకత్వానికి మోరల్ సపోర్టుగా ఉంటాయి. రేవంత్ రెడ్డి స్థానానికి మరింత బలం చేకూర్చాయి.
