తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం సద్దుమణగక ముందే, ఇప్పుడు హ్యాకింగ్ రూపంలో సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసులను వేగవంతం చేస్తుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం అధికార పక్షంపై ట్యాపింగ్ కాదు.. ఏకంగా హ్యాకింగ్‌కు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా ఉంచేందుకు అధునాతన సాంకేతికతను వాడుతోందని ఆరోపించారు. కేవలం ఫోన్లు మాత్రమే కాదు, నేతల నివాసాల్లోని సీసీటీవీ కెమెరాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మా ఇంట్లో మేము ఏం మాట్లాడుకుంటున్నామో, ఎవరిని కలుస్తున్నామో తెలుసుకోవడానికి కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో తాము ట్యాపింగ్ చేశామని ఆరోపించిన వారు, ఇప్పుడు అంతకంటే దారుణమైన హ్యాకింగ్ సంస్కృతికి తెరలేపారని ఆయనంటున్నారు.
ఈ హ్యాకింగ్ ఆరోపణల వెనుక ప్రభుత్వం ఉపయోగిస్తున్న కొన్ని ప్రత్యేక సాఫ్ట్వేర్ల గురించి హరీష్ రావు ప్రస్తావించారు. సీసీటీవీలు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, ఐపీ అడ్రస్‌ల ద్వారా ప్రైవేట్ సంభాషణలను రికార్డ్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ట్యాపింగ్ కేసులో అధికారులు జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు హ్యాకింగ్‌కు సహకరిస్తున్న అధికారులు కూడా భవిష్యత్తులో అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఒకప్పుడు ఫోన్లలో ట్యాప్ శబ్దాల కోసం వెతుక్కున్న నేతలు, ఇప్పుడు గోడలపై ఉన్న కెమెరాల వైపు అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాజకీయాల్లో ఈ ట్యాపింగ్ వర్సెస్ హ్యాకింగ్ వార్.. రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది.
