ఫోన్ ట్యాపింగ్ కేసును ఎలా నిరూపించాలో తెలియక కిందా మీదా పడుతున్న తెలంగాణ ప్రభుత్వం చివరికి ఓ పరిష్కార మర్గాన్ని కనిపెట్టింది. సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.ఇది చాలా విస్తృతమైన కేసు అని.. రాష్ట్ర ఏజెన్సీలు చేయగలిగినంత చేశాయి కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి .. కేంద్రానికి ఇస్తున్నామని చెప్పి..సీబీఐకి సిఫారసు చేయాలని సిద్ధమయ్యారు.
ఈ కేసులో బండి సంజయ్ లాంటి వాళ్లు సీబీఐకి ఇవ్వాలని చాలా సార్లు డిమాండ్ చేశారు. కానీ ఇంత కాలం ఈ కేసులో ఏదో చేస్తారని అనుకున్న తెలంగాణ పోలీసులు అడుగు ముందుకు వేయలేకపోయారు. ఇక సీబీఐకి ఇస్తే వారే ఆ బాధ్యత చూసుకుంటారని..చర్యలు తీసుకోకపోతే.. ప్రజలు కూడా వారిపైనే అనుమానపడతారన్న వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయాలనుకుంటున్నారు.
కాళేశ్వరం కేసును ఇప్పటికే సీబీఐకి సిఫారసు చేశారు. కానీ సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదు. ప్రస్తుతం కోర్టులో పిటిషన్ ఉంది. కానీ సీబీఐ కేసు విచారణ చేపట్టకుండా ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సీబీఐ.. కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ ఎదురు చూడాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ కేసుపై లేఖ పంపిస్తే.. సీబీఐ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.