తెలంగాణ ఉద్యమం అనే నిప్పును అంటించడానికి నీళ్లను చాలా తెలివిగా వాడుకున్నారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లన్ని దిగువ ప్రాంతమైన ఏపీకి వెళ్తున్నాయని .. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని దీన్ని సరిదిద్దుకోవాలంటే ప్రత్యేక తెలంగాణ రావాల్సిందేనని ప్రజల మనసుల్లో నాటారు. నీళ్లతో పాటు నిధులు, నియామకాలు అని కూడా ఉద్యమించారు. ఆ అంశాల్లో ఎంత న్యాయం చేసుకున్నారో కానీ ఇప్పుడు మళ్లీ నీళ్ల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టి తమ రాజకీయాలు చేసుకునేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కానీ వాడేసిన అస్త్రం మళ్లీ మళ్లీ ఎలా ఉపయోగపడుతుందన్నది మాత్రం ఆలోచించడం లేదు.
నీళ్ల పేరుతో నిప్పులు రాజేసేందుకు బీఆర్ఎస్ విఫలయత్నాలు
ప్రతి రోజూ బీఆర్ఎస్ నీళ్లు చంద్రబాబుకు.. నిధులు రాహుల్ కు .. రేవంత్ ఇస్తున్నారని ట్వీట్లు చేస్తూంటారు. ఆరోపిస్తూంటారు. తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్లను పాతిపెడతాం.. తరిమికొడతాం లాంటి డైలాగుల్ని వాడుతూ ఉంటారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఓ ఫార్మల్ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే.. మీటింగ్ అయిపోక ముందే.. తెలంగాణ నీళ్లన్ని ఏపీకి రాసిచ్చేశారని ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకు వచ్చి ఆరోపించడం ప్రారంభించారు. తెలంగాణ ప్రజల నుంచి ఆంధ్రోళ్లు ఏదో తీసుకెళ్లిపోయారని అనుకునేలా చేయగలిగితే చాలని అన్నీ మరచిపోతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ రాజకీయాలపై ప్రజల్లో విరక్తి
అయితే ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా.. ప్రజలేమనుకుంటున్నారు.. నిజంగానే తెలంగాణ నీళ్లు ఏపీ తీసుకెళ్తుందని నమ్ముతున్నారా లాంటి అంశాలపై కనీసం ఫీడ్ బ్యాక్ తీసుకోకుండా చేసే రాజకీయాలు వికటిస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే ఉంది. బనకచర్ల అనేది ఇప్పటికీ పేపర్ల దశ దాటని ప్రాజెక్టు. నిన్నటికి నిన్న గోదావరి నుంచి సముద్రంలోకి వందల టీఎంసీలు పోయాయి. ఇప్పుడు కూడా పోతున్నాయి. వాటిని ఆపుకునే శక్తి తెలంగాణకు కూడా లేదు. మరి ప్రజలు తమ నీరు తీసుకుంటున్నారని ఎలా అనుకుంటారు ?. కృష్ణా నీరు కూడా.. వరద వచ్చినప్పుడు వెంటనే తెలంగాణ.. ఉన్న ప్రాజెక్టుల మేర మళ్లించుకుంటున్నారు. కృష్ణాబోర్డు ఉంది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారమే నీళ్లు విడుదల చేస్తున్నారు. ప్రజలకు వీటిపై స్పష్టత ఉంది.
కేసీఆర్ వల్లే అన్యాయమన్న భావన పెంచుతున్న రేవంత్
కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం ఏదైనా జరిగింది అంటే.. అది ఖచ్చితంగా బీఆర్ఎస్, కేసీఆర్ చేసిందేనని ఇప్పటికే ప్రజల్లో ఓ స్పష్టత ఉంది. రాష్ట్ర విభజన తరవాత కేవలం 299 టీఎంసీల నీటి వాటాకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది అధికారికం. ఒప్పందం. పదేళ్ల వరకూ ఆ ఒప్పందం అమవలవుతున్నప్పుడు కేసీఆర్ సైలెంటుగా గానే ఉన్నారు. ఇప్పుడు రచ్చ చేస్తే ఎవరికి నష్టం ?. గోదావరి జలాలలో సీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన కేసీఆర్ మాటలు కళ్ల ముందే ఉంటే.. ప్రజలు బీఆర్ఎస్ నీళ్ల రాజకీయాలను నమ్ముతారా?. ప్రజలకు మతి మరుపు ఎక్కువ అనుకుని ఇలాంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ చేస్తోంది. కానీ ప్రజలు .. ఊరకనే ఆవేశపడిపోరు. తమను రెచ్చగొట్టి రాజకీయం చేసే వాళ్లకు సమయం చూసి కర్రు కాల్చి వాత పెడతారు.