ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ బ్రాండ్ ను ఈ సారి దావోస్‌లో ఓ రేంజ్లో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించిన ఆయన ఈ సారి దావోస్‌లో ప్లాన్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఈ నెలలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రైజింగ్ పేరుతో ఒక ప్రత్యేక పెలివియన్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక వేదికపై తెలంగాణ 2047 విజన్‌తో పాటు, రాష్ట్ర అభివృద్ధిని మలుపు తిప్పే కీలక ప్రాజెక్టులను ప్రపంచ దేశాల సీఈఓలు, పారిశ్రామిక దిగ్గజాల ముందు ఆవిష్కరించనున్నారు.
ఈ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ రోడ్‌మ్యాప్‌గా భావిస్తున్న CURE, PURE, RARE వంటి వినూత్న విధానాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించనున్నారు. తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్టుల ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా ఐటీ, తయారీ మరియు సేవా రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని సీఎం ఈ వేదికపై ప్రదర్శించనున్నారు.
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం జనవరి 20న జరగనున్న లాంచ్ ప్రోగ్రామ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030 తో పాటు ‘తెలంగాణ AI హబ్ ను అధికారికంగా ప్రారంభించనుంది. రాబోయే నాలుగేళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగనున్నాయి.


