తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం ముగిసింది. 22న అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచులు, ఉపసర్పంచ్లు ప్రమాణ స్వీకారాలు చేస్తారు. గ్రామపాలన ప్రారంభమవుతుంది. అయితే స్థానిక ఎన్నికలు ఇంతటితో అయిపోతే పరిషత్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాల్సి ఉంది. కోర్టు తీర్పు కారణంగా పాత బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని పరిషత్, మున్సిపల్ ఎన్నికల గురించి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. రిజర్వేషన్ అంశం తేలదు. కాబట్టి ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ వాయిదా వేస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది.
ఎన్నికలు బ్యాక్లాగ్ పెట్టుకుంటే ఎప్పటికైనా సమస్యే !
బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లారు. కానీ అది చట్టపరంగా సాధ్యం అయ్యేలా లేదు. ఇలాంటి సమయంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించడమే మార్గం. ఎన్నికలను వాయిదా వేసుకుంటూ పోతే.. అవి ఎప్పటికప్పుడు భారంగానే మారుతూంటాయి. పంచాయతీల పదవి కాలం పూర్తి అయినప్పుడే ఎన్నికలు నిర్వహించేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. కానీ ప్రభుత్వం వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొంత నష్టం జరిగింది., మిగిలిన ఎన్నికలు పూర్తి చేయకపోతే గుదిబండగా మారుతాయి.
రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదు.. ఇప్పుడే నిర్వహిస్తే బెటర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. పార్లమెంట్ లో తాము ప్రతిపాదించే బిల్లు కూడా పాస్ చేసుకోలేదు కాంగ్రెస్. అలాంటప్పుడు రాజ్యాంగ సవరణ అసాధ్యం. కేంద్రం తొక్కిపెట్టిందని బీజేపీపై నిందలేసినా ప్రయోజనం ఉండదు. అందుకే ఈ ఊపులోనే పరిషత్, మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించేయాలి. ప్రజాభిప్రాయం తమకే అనుకూలంగా ఉందన్న భావన పెంచుకోవాలి. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే.. రేపు ఎప్పుడు అయితే ఎన్నికలు వద్దనుకుంటారో.. అప్పుడే నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి మీద పడే బండలను పైన ఉంచుకోవడం రాజకీయంగా తెలివైన నిర్ణయంకాదు.
అర్బన్ ఓటర్ నాడి ముఖ్యం
గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉందంటే.. పట్టణ ప్రాంతాల్లో ఇంకా మంచి సానుకూలత ఉంటుంది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ఈ విషయం స్పష్టమయింది. అందుకే పెండింగ్ ఉన్న అన్ని ఎన్నికలను .. పరిష్కారం కాని సమస్యలతో ముడిపెట్టి.. ఉంచుకోవడం కన్నా.. ఎన్నికలు పూర్తి స్థాయి స్థానిక పాలనను ప్రజల చేతుల్లో పెడితే ప్రయోజనం ఉంటుంది.