తెలంగాణ రిజిస్ట్రేషన్ సేవల్లో సంచలన మార్పు వచ్చింది. కొద్ది ప్రాంతాల్లో అమలవుతున్న స్లాట్ బుకింగ్ విధానం రాష్ట్రమంతటా సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన, సమర్ధవంతమైన సేవలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో స్లాట్ బుకింగ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశారు. మంచి ఫలితాలు రావడంతో అన్ని చోట్ల అమలు ప్రారంభించారు. ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ బుకింగ్ విధానం తెచ్చారు.
అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ -ఎఐ అనుసంధానమైన చాట్‌బాట్ అందుబాటులో ఉంటుంది. 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబాటు వంటి సమాచారం లభిస్తుంది.
గిప్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఎఐ చాట్‌బాట్ – మేధ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. అక్రమాలకు చెక్ పెట్టేలా లే అవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా, రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు బిల్డర్ లేదా డవలపర్ దగ్గర వివరాలు ఉండేలా డవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలో తీసుకురానున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మెరగైన సేవలు అందించనున్నాయి.