తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 50,000 మేర తగ్గింది. గత ఏడాది ఇదే సమయానికి 13 లక్షల డాక్యుమెంట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 12.50 లక్షలకే పరిమితమైంది. అయినప్పటికీ, స్టాంపులు , రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి అందే ఆదాయం మాత్రం గత ఏడాది కంటే సుమారు రూ. 600 కోట్లు అదనంగా వచ్చింది.
రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడమే. 2026 ప్రారంభం నుండి ప్రభుత్వం అమలు చేసిన కొత్త మార్కెట్ విలువల వల్ల, తక్కువ లావాదేవీలు జరిగినప్పటికీ ప్రభుత్వానికి అందే స్టాంప్ డ్యూటీ ,రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరిగాయి. దీనివల్ల 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ.19,100 కోట్ల భారీ ఆదాయ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఆదాయం పెరగడానికి మరో ముఖ్య కారణం కొనుగోలుదారులు గృహ రుణాల వైపు మొగ్గు చూపడం. బ్యాంకుల నుంచి ఎక్కువ రుణం పొందడం కోసం, చాలామంది ప్లాట్లు లేదా ఫ్లాట్ల విలువను రిజిస్ట్రేషన్ సమయంలో అసలు మార్కెట్ ధరకే చూపిస్తున్నారు. గతంలో చాలావరకు ప్రభుత్వ కనీస ధర వద్దే రిజిస్ట్రేషన్లు జరిగేవి, కానీ ఇప్పుడు అధిక విలువ వద్ద డాక్యుమెంట్లు నమోదు అవుతుండటంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది.
హైదరాబాద్లోని కోకాపేట్, కొండాపూర్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో 1 కోటి పైబడిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం.. లావాదేవీల సంఖ్య స్వల్పంగా తగ్గినా, అధిక విలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల వల్ల ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధి నమోదు చేసింది.


