కేసీఆర్ స‌ర్కారుకు రెవెన్యూ ఉద్య‌మ సెగ త‌ప్ప‌దా?

రెవెన్యూ శాఖ స‌మూల ప్ర‌క్షాళ‌న‌కు కేసీఆర్ స‌ర్కారు సిద్ధ‌మౌతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త‌వారంలో క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన స‌మావేశంలో ఇదే అంశం ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఏకంగా రెవెన్యూ శాఖ‌ను ర‌ద్దు చేయ‌డం, మ‌రో శాఖ‌లో విలీనం లాంటి ప్ర‌తిపాద‌న‌లు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ నేప‌థ్యంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న‌కు సిద్ధ‌మౌతున్నాయి. ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన స‌మావేశానికి సంబంధించి కొన్ని లీకులు త‌మ‌కు అందాయ‌నీ, రెవెన్యూ శాఖ ప్ర‌క్షాళ‌న పేరుతో స‌మూలంగా ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని త‌మ‌కు తెలుస్తోంద‌నీ, అదే చేస్తే త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌నేది ఉద్యోగ సంఘాల ఆవేద‌న‌. ఇదే విష‌య‌మై ఇవాళ్ల రెవెన్యూ శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ సోమేష్ కుమార్ ని క‌లిసి విన‌తి ప‌త్రం ఇస్తామ‌ని సంఘాల నేత‌లు చెబుతున్నారు. ఈ నెల 29న 4 వేల మంది ఉద్యోగుల‌తో ధ‌ర్నాకి సిద్ధ‌మౌతున్నాయి.

వీఆర్వో, వి.ఆర్.ఎ. వ్య‌వ‌స్థ‌ల్ని ర‌ద్దు చేయ‌డంతోపాటు త‌హ‌సిల్దార్ అధికారాల్లో కోత‌కు ప్ర‌భుత్వం సిద్ధ‌మౌతున్న‌ట్టు త‌మ‌కు తెలిసింద‌ని ఉద్యోగులు అంటున్నారు. ఇన్నాళ్లూ వేర్వేరుగా ఉంటూ వ‌చ్చి ఈ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు స‌మైక్య‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ లో స‌మావేశ‌మైన ఉద్యోగులు ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్య‌మ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకున్నారు. అక్టోబ‌ర్ 2లోపు ద‌శ‌ల‌వారీగా చేప‌ట్టాల్సిన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణపై చ‌ర్చించారు. రెవెన్యూ శాఖ‌ను కాపాడండి… ఇత‌ర శాఖ‌లో విలీనాన్ని ఆపండి అనే నినాదంతో ఈనెల 29న 4 వేల‌మందితో నిర‌స‌న స‌భ‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఈ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ల‌తోపాటు కొన్ని ప్ర‌జా సంఘాలు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నాయి.

రెవెన్యూ శాఖ ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దు అని కేసీఆర్ చెప్పిన‌ప్ప‌ట్నుంచే ఆ శాఖ ఉద్యోగులు గుర్రుగానే ఉన్నారు. ఆ శాఖ‌లోనిర‌స‌న గ‌ళం అప్ప‌ట్నుంచే ఉంది. అయితే, త్వ‌ర‌లోనే మార్పులు త‌ప్ప‌వ‌ని తేలిపోవ‌డంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల‌న్నీ ఒక్కోటిగా ఏక‌మౌతున్న ప‌రిస్థితి. కేసీఆర్ ఇంత‌వ‌ర‌కూ తీసుకుంటూ వ‌చ్చిన నిర్ణ‌యాల‌పై ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచే ఈ స్థాయి నిర‌స‌న వ్య‌క్తం అవుతూ ఉండ‌టం ఇదే ప్ర‌థ‌మం. తెరాస ప్ర‌భుత్వానికి ఇదో కొత్త త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏదేమైనా స‌రే, ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దు అనేదే సీఎం ప‌ట్టుద‌ల‌గా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com