తెలంగాణా రాష్ట్రానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఈ ఏడాదికి ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డుని దక్కించుకొంది. అభివృద్ధి, వ్యాపార దృక్పథం, మార్కెటింగ్ నైపుణ్యాలు, వాటిని అమలుచేయడంలో జాతీయ దృక్పధం కనబరిచే రాష్ట్రాలకి సి.ఎన్.బి.సి., టీవి-18 కలిసి గత 11 ఏళ్లుగా ప్రతీ ఏటా ఈ బిజినెస్ లీడర్స్ అవార్డుని అందజేస్తున్నాయి. ఈ ఏడాదికి తెలంగాణా రాష్ట్రానికి ఆ అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 30వ తేదీన డిల్లీలో కేంద్రమంత్రుల సమక్షంలో ఈ అవార్డుని మంత్రి కెటిఆర్ తెలంగాణా ప్రభుత్వం తరపున స్వీకరిస్తారు.
తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రాజకీయపార్టీలతో, మీడియాతో ఏవిధంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అభివృద్ధి విషయంలో మాత్రం చాలా వేగంగా, పారదర్శకంగా, సమర్ధంగావ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు అభివృద్ధి అంకెల్లో కాకుండా ప్రత్యక్షంగా కళ్ళకే కనబడుతోంది. కనుక ఈ అవార్డుకి తెలంగాణా రాష్ట్రం అన్నివిధాల అర్హమైనదే.
తెలంగాణా రాష్ట్ర అవసరాలు, అది ఎదుర్కొంటున్న సమస్యలు, అందుకు గల అవరోధాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా మంచి అవగాహన ఉండటంతో, వాటికోసం చక్కటి ప్రణాళికలను సిద్దం చేసుకొని, వాటిని అమలుచేయడానికి సమర్ధులైన మంత్రుల్ని నియమించుకొన్నప్పుడే సగం విజయం సాధించారు. రాజకీయాలు, ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలని ముఖ్యమంత్రి కెసిఆర్, పరిశ్రమలు, పెట్టుబడుల బాధ్యతని మంత్రి కెటిఆర్, సాగునీటి వ్యవహారాలని మంత్రి హరీష్ రావు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వంలో ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులు కూడా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని, లక్ష్యాలకి అనుగుణంగా నిశబ్దంగా ఎవరిపని వారు చక్కగా చేసుకుపోతున్నారు. అందరి సమిష్టి కృషి కారణంగానే కేవలం రెండేళ్ళ వ్యవధిలోనే అనేక పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు తెలంగాణాకి తరలివచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి కూడా. సుదీర్గ కాలంగా తెలంగాణా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు చకచకా పరిష్కారం అవుతున్నాయి. కనుక ఈ క్రెడిట్ చక్కతిఒ నాయకత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుంది. అయన ప్రయత్నాలు ఫలిస్తే 2019నాటికి తెలంగాణా రాష్ట్రం దేశంలో చాలా బలమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.