తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అమ్మాయిలను చీట్ చేస్తున్నారు” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసాయి.
టాలీవుడ్‌కు చెందిన ఒక టాప్ ప్రొడ్యూసర్, భార్యా పిల్లలు ఉన్నా కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆమెతో పిల్లలకూ జన్మనిచ్చి చివరికి మోసం చేశాడు అని శారద బహిరంగంగా వెల్లడించారు. బాధితురాలు మహిళా కమిషన్ వద్ద న్యాయం కోసం వచ్చిందని, నిందితుడిని పిలిపించడానికి నోటీసులు కూడా సిద్ధం చేశామని, అయితే అనూహ్యంగా బాధితురాలు వెనకడుగు వేసిందని చెప్పారు.
శారద ఆయన పేరును బహిరంగంగా చెప్పలేదు. కానీ “ఆయన చాలా పెద్ద నిర్మాత… ఇటీవల ఆయన సినిమా ఒకటి బ్లాక్‌బస్టర్ హిట్ అయింది” అని క్లూస్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరు ఆ నిర్మాత? ఎందుకు బాధితురాలు వెనకడుగు వేసింది? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.