ఏడాదిన్నర తెరాస పాలనలో తెలంగాణా రెట్టింపయిన అప్పులు?

రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్, అప్పులు, ఆర్ధిక సమస్యలు దక్కితే, తెలంగాణాకి అక్షయపాత్ర వంటి హైదరాబాద్ కూడిన రాష్ట్రం దక్కింది. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునాదుల నుంచి నిర్మించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే, అంతవరకు అసలు ఉనికే లేని తెలంగాణా రాష్ట్రం దేశంలో గుజరాత్ తరువాత రెండవ ధనిక రాష్ట్రంగా అవతరించింది. దేశంలో ఏ-1 గ్రేడ్ ఆర్ధిక శక్తి కలిగిన రాష్ట్రాలలో తెలంగాణా కూడా ఒకటిగా నిలిచింది. ఆ విషయం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించుకొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తెలంగాణాకి రూ.70, 000 కోట్లు అప్పులు ఉండేవి. అందులో సింహభాగం రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణా వాటాగా దక్కాయి. కానీ అదే సమయంలో మిగులు బడ్జెట్ తో తెరాస ప్రభుత్వం అధికారం చేప్పట్టింది. సరిగ్గా ఏడాదిన్నర కాలం తిరక్కుండానే ఇప్పుడు ఆ అప్పులు రూ.1.43 లక్షల కోట్లకి చేరుకొంది. అంటే అప్పులు దాదాపు రెట్టింపు అయ్యాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున వాటి కోసం అప్పులు చేసి ఉండవచ్చును. కానీ ఈ గణాంకాలు ప్రతిపక్షాలకు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మంచి అవకాశం కలిపిస్తున్నాయి.

రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, దానిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి గురించి తెలంగాణా తెదేపా నేతలు ఎర్రబెల్లి, రావుల, అరికెల నర్సారెడ్డి, ప్రతాప్ రెడ్డి, తదితరులు నిన్న డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వానికి పిర్యాదు చేసారు. అనంతరం డిల్లీలోని తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని తెరాస చేతిలో పెడితే ఏడాదిన్నర తిరక్కుండానే దానిని అప్పుల పాలు చేసారని విమర్శించారు.

తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా చెప్పుకొంటూ రైతుల ఆత్మహత్యలు చేసుకొంటున్నా వారి రుణాలు మాఫీ చేయడం లేదని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు చేసి ఉండి ఉంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే వాళ్లము కాము కానీ కేసీఆర్ అనవసరమయిన పనులకు, ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు చేయడాన్ని తాము నిరసిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ మెదక్ లోని తన వ్యసాయ క్షేత్రంలో అల్లం పంట గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆ పరిసర గ్రామాలలోనే ఆర్ధిక బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్న సుమారు 50మంది రైతుల గురించి ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో కేసీఆర్ కి అండగా నిలబడిన ప్రొఫెసర్ కోదండ రామ్ ఇప్పుడు రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ ని నిలదీసేందుకు హైకోర్టులో ఒక కేసులో ఇంప్లీడ్ అయ్యారని తెదేపా నేతలు కేసీఆర్ కి గుర్తు చేసారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com