టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లొకేశ్ కోసం తెలంగాణ టీడీపీ నేతలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే! గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎలాగైతే టీడీపీని ముందుండి నడిపించారో.. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో తనదైన వ్యూహాన్ని ఎలా అమలుపరిచారో.. ఆ రకంగా ఆ ఎన్నికల ఫలితాల్లో తనదైన ముద్రను ఎలా వేయగలిగారో మరిచారని అనుకోలేం కానీ… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోసం తెలంగాణ టీడీపీ నేతలు వేయికళ్లతో ఎదురుచూశారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి లోకేశ్ అవసరం ఎంతో ఉందని వారంతా గ్రహించారు. ఆయనవస్తే తెలంగాణలో టీడీపీకి ఎదురుండదని భావించారు. అయితే… వారి ఆశలపైనా, అంచనాలపైనా చంద్రబాబు నీళ్లు చల్లారు!
తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నట్లు తెలంగాణలో బలహీనపడుతున్న తెరాస కు ప్రత్యామ్నాయ శక్తిగా మారుతూ, 2019 ఎన్నికల అనంతరం తెలంగాణలో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలో ఆలోచిస్తున్న టి-టీడీపీ నేతలకు ఇప్పుడు ఒక బలమైన, ప్రజామోదం ఉన్న, పార్టీని బలంగా ముందుకునడిపించగల సమర్ధత ఉన్న నాయకుడు అవసరం. ఆ నాయకుడు మరెవరో కాదు నారా లోకేశ్. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వంటి నాయకులను ధీటుగా ఎదుర్కొంటూ, ప్రభుత్వ వ్యతిరేకతను టీడీపీకి అనుకూలంగా మార్చగలిగిన నాయకుడు ఆయనే! సరిగ్గా ఈ ఆలోచనతోనే తెలంగాణ టీడీపీ నేతలు లోకేశ్ ను తెలంగాణకు ఇచ్చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ప్రపోజల్ పెట్టారు. తమదైన శైలిలో.. “లోకేశ్ ను తెలంగాణ టీడీపీకి ఇవ్వాల్సిందే” అని పట్టుపట్టారు. అయితే… చంద్రబాబు మాత్రం వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.. “లోకేశ్ ను తెలంగాణ టీడీపీకి ఇవ్వలేం” అని తేల్చేశారు.
అవును… ఇకపై టీ.టీడీపీ తెలంగాణలో బలమైన నాయకుడు లేకుండా పోరాడాల్సిందే. సమర్ధవంతమైన నాయకుడు లేకుండా జనాల్లోకి వెళ్లాల్సిందే. దానికి కారణం.. లోకేశ్ ను ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటున్నారట! ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన చంద్రబాబు… లోకేశ్ కు మంత్రిపదవి ఇవ్వాలనుకుంటున్నామని, దాంతో ఆయన మరింత బిజీ అయిపోతారని చెప్పారట. ఆ కారణంగానే లోకేశ్ కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఇవ్వలేమని అన్నారట. దీంతో గురువారం రాత్రి విజయవాడలో చంద్రబాబు నివాస స్థలంలో భేటీ అయిన తెలంగాణ టీడీపీ నేతలు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చిందట.
ఆ సంగతులు అలా ఉంచి కాస్త వాస్తవంలోకి వస్తే… తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా లోకేశ్ కు తెలంగాణలో ఆ స్థాయి ప్రజాదరణ ఉందా? 2016 జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో లోకేశ్ నాయకత్వంలోని టీడీపీ సాధించింది కె.పి.హెచ్.బి. కాలనీ లో మాత్రం గెలవడం. అంటే.. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ రూపంలో గ్రేటర్ లో టీడీపీ దుమ్ములేపుతుందని భావించిన చోట ఒక్కరంటే ఒక్కరిని గెలిపించుకోవడమే లోకేశ్ సత్తానా? ఏపీలో టీడీపీ సభ్యత్వాలు లోకేశ్ సామర్ధ్యంతో వచ్చాయని చెబుతున్నట్లుగా తెలంగాణ సభ్యత్వాలు ఆ స్థాయిలో రాకపోవడానికి కారణం కూడా లోకేశ్ సత్తానేనా? ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉన్న పరిస్థితికి లోకేశ్ రావడం వల్ల ఒరిగేది ఏముటుందని వారు భావిస్తున్నారు? ఈ సమయంలో తెలంగాణ టీడీపీకి మోడీ వంటి నాయకుడు కావాలని చంద్రబాబు చెప్పినట్లుగా… ఆ మోడీ, లోకేశ్ బాబే అని టి.టీడీపీ నేతలు భావిస్తున్నారా? ఆ రాజకీయ చాణక్యం, ఆ స్థాయి సమర్ధత లోకేశ్ కు తెలంగాణలో ఉందని చెప్పగలరా? చంద్రబాబే కాస్త ఖాళీ చేసుకుని తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అడగలేరా? ఏమో… వాస్తవాలు, సమాధానాలు టిటీడీపీ నేతలకే ఎరుక!!