హీరోలకు కథలపై, రచనపై అవగాహన ఉండడం చాలా అవసరం. ఉపయుక్తం. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కొంతమంది హీరోలు కథలు రాసుకొంటున్నారు. డైలాగులు రాసుకొంటున్నారు. స్క్రీన్ ప్లే నైపుణ్యం చూపించుకొంటున్నారు. తమ బలాబలాలు వాళ్లకు తెలుసు కాబట్టి, అందుకు లోబడే స్క్రిప్టులు తయారు చేసుకొంటున్నారు. సిద్దుజొన్నలగడ్డ, విశ్వక్సేన్, నవీన్పొలిశెట్టి, అడవిశేష్.. వీళ్లకు రచనకు సంబంధించిన పరిజ్ఞానం ఉంది. వారి వారి విజయాల్లో కథకుల సంబంధించిన నాలెడ్జ్ వాళ్లకు బాగా ఉపయోగపడింది. నిర్మాతలు కూడా అందుకు ప్రిపేర్ అయిపోయే సినిమాలు తీస్తున్నారు. ఉదాహరణకు – సిద్దు జొన్నలగడ్డను తీసుకొందాం. ఆయన ఓ కథ రెడీ చేసుకొని, అప్పుడు నిర్మాతల్ని అప్రోచ్ అవుతున్నారు. ఆ కథని డీల్ చేయగల దర్శకుడ్ని ఎంచుకొని, ప్రొసీడ్ అవుతున్నారు. ఓ అవగాహనతో ముందుకెళ్లే ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
కానీ మరో రకం హీరోలు కూడా ఉన్నారు. ఓ దర్శకుడు కథ తీసుకెళ్తే.. ‘నీ కథ పక్కన పెట్టు.. నా పాయింట్ పై వర్క్ చేయ్..’ అని హుకుం జారీ చేస్తారు. లేదంటే `పాయింట్ బాగుంది. కానీ ఇలాచెయ్.. అలా చేయ్` అంటూ స్క్రిప్టు దశలోనే డైరెక్షన్లు మొదలు పెడుతున్నారు. హీరో చెప్పినట్టు కథ మార్చుకొంటూ పోతే.. దర్శకుడు రాసుకొన్న పాయింట్ పూర్తిగా డైవర్ట్ అయిపోతోంది. కాసేపు ఆగి ఆలోచిస్తే ‘అసలు నేను రాసుకొన్న కథ ఇది కాదు కదా’ అని కూడా అనిపిస్తుంది. ఆ స్థాయిలో ఉంటుంది హీరోగారి మార్పులు, చేర్పులు. అవకాశాలు రావడమే ఎక్కువ అనుకొనే దర్శకులు.. హీరోలతో, వాళ్ల ఐడియాలజీలతో రాజీ పడిపోతుంటారు. కానీ ఓ స్థాయి వచ్చిన దర్శకులతోనే ఇబ్బంది. అక్కడ ఈగో క్లాష్లు వస్తుంటాయి.
పోనీ.. హీరోగారు చెప్పిన `స్టోరీ` అయినా బలంగా ఉంటుందా అంటే అదీ ఉండదు. నాలుగైదు ఇంగ్లీష్ వెబ్ సిరీస్లు కలగలిపితే వచ్చే పాయింట్ అది. దాన్నే.. బాగా డవలప్ చేద్దామనుకొంటే.. దర్శకుడు ఎన్ని వెర్షన్లు రాసుకెళ్లినా అవి హీరోలకు నచ్చవు.
‘నేను అనుకొన్నది ఇది కాదు..’ అని.. ఆయన అప్పటికే రాసిపెట్టుకొన్న అరాకొర స్క్రీన్లు, ఉడికీ ఉడకని స్క్రీన్ ప్లే.. ముందుంచుతారు. ఇక దాంతో కుస్తీపాట్లు పడలేక… కొంతమంది దర్శకులు ప్రాజెక్టుని వదిలేసి వెళ్లిపోతున్నారు. మరి కొందరు పూర్తిగా హీరోలకు సరెండర్ అయిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. సదరు సినిమా రిలీజ్ అయితే.. ఫలితం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫ్లాప్ అయితే దర్శకుడికి మరో ఛాన్స్ రాదు. కానీ హీరోగారికి.. ఏదో ఓ రూపంలో అవకాశాలు వస్తూనే ఉంటాయి.
టాలీవుడ్ లో ఈ తరహా హీరోలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ల దగ్గరకు దర్శకులు కథలు పట్టుకెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటి హీరోలకు కావాల్సింది దర్శకులు, రచయితలు కాదు. తాము అనుకొంటున్న పాయింట్లని, కథగా మార్చి, సినిమా తీసే అసిస్టెంట్లు. సినిమా అనేది దర్శకుడి కల. అది… ఆయన కళ్లతో చూస్తేనే బాగుంటుంది. ఓ ఐడియాని కథగా రాసి, సినిమాగా చూపించడానికి దర్శకుడు చాలారకాలుగా ప్రసవ వేదన అనుభవిస్తుంటాడు. ప్రాణం పెట్టి రాసిన కథలో హీరోలు వేలు పెట్టడం, చివరికి ఫలితాలు తేడా వస్తే బాధ్యత మొత్తం దర్శకుడిపైనే వదిలేయడం దారుణం. ఈ విషయంలో హీరోల ఆలోచనా ధోరణి మారాలి. నిజంగా తాము రాసుకొన్న కథపై తమకే అంత ఇష్టం ఉంటే.. కథారచయితగా వాళ్ల పేర్లే వేసుకొని, క్రెడిట్ కూడా వాళ్లే తీసుకోవాలి. దర్శకత్వంపై మమకారం ఉంటే, బాధ్యత కూడా నెత్తిమీద పెట్టుకోవాలి. అంతే తప్ప.. తమ పైత్యానికి మరొకర్ని బలి చేసేయకూడదు.
