ప్రతినాయకుడి పాత్ర ఎంత బలంగా ఉంటే… హీరో పాత్ర అంత బాగా పండుతుంది. ఇది దర్శకులంతా నమ్మే సిద్ధాంతమే. అయితే ప్రతీసారీ ఈ ఫీట్ సాధ్యం కాదు. హీరోని డామినేట్ చేస్తే… ఫ్యాన్స్ ఎక్కడ ఫీలవుతారో అని.. విలన్ పాత్రల్లో పవర్ కాస్త కాస్త తగ్గించుకొంటూ వెళ్తుంటారు. దాంతో అసలుకే మోసం వస్తుంది. కాకపోతే ఈమధ్య దర్శకులు విలన్ పాత్రల్ని తీర్చిదిద్దడంలో నిష్టాతులైపోతున్నారు. రాజమౌళి, బోయపాటి శ్రీను సినిమాల్లో విలన్ ఎంత భయంకరంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగిలిన దర్శకులూ అదే పంధాలో సాగుతున్నారు. విలన్ పాత్ర బాగా రాసుకొన్నా, రాసుకోకపోయినా… ఆ పాత్రలో ఓ పేరున్న నటుడ్ని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. రైటింగ్ కాస్త వీక్ అయినా, ఆనటుడు తన ఇమేజ్ తో పాత్రల్ని గట్టెక్కిస్తున్నాడు. ఎస్.జె.సూర్య, విజయ్ సేతుపతి, సత్యరాజ్, సంజయ్‌దత్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ.. ఇలా పరభాషా నటులు మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేశారంటే.. దానికి కారణం ఇదే. ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి పాత్రలు చేయగలిగే నటులున్నారన్న సంగతి మేకర్స్‌కి అర్థం అవుతోంది. జగపతిబాబు విలన్ గా ఓ ట్రెండ్ సెట్ చేశారు. ‘బాహుబలి’లో విలనిజం ఎలా ఉంటుందో చూపించాడు రానా. ఈమధ్య `మిరాయ్`తో విలన్‌గా మెప్పించాడు మంచు మనోజ్. తనకు ఇలాంటి పాత్రలు ఇప్పుడు మరిన్ని దక్కబోతున్నాయి.
విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రౌడీ జనార్థన్’లో ప్రతినాయకుడి పాత్ర కోసం రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. రాజశేఖర్‌తో విలనిజం పండించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ కి మరో స్ట్రాంగ్ విలన్ దొరికినట్టే. నాని పారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. విలన్ పాత్ర పోషించడం మోహన్ బాబుకి కొత్త కాదు. కాకపోతే నాని లాంటి ఈ జనరేషన్ హీరోలతో తలపడడం మాత్రం పూర్తిగా కొత్త. ఈ సినిమా వర్కవుట్ అయితే.. కొంతకాలం విలన్ల కోసం మన దర్శకులు పక్క రాష్ట్రాలవైపు చూసే అవకాశం రాకపోవొచ్చు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం విలన్ గా కనిపించబోతున్నార్ట. బ్రహ్మీలో ఇప్పటి వరకూ బయటపడని కోణం ఇది. దాన్ని ఆయన ఎంత సమర్థవంతంగా పోషిస్తారో చూడాలి.
మన నటులకు విలన్ పాత్రలపై మక్కువ ఏర్పడింది. అది కూడా ఓకందుకు మంచిదే. కొత్త విలన్లు వస్తున్న కొద్దీ.. ఆ పాత్రలు మరింత పటిష్టంగా తయారవుతాయి. విలన్ పరిధి పెరిగే కొద్దీ.. హీరో తన విశ్వరూపం చూపించే అవకాశం పెరుగుతూనే ఉంటుంది. ఓ సమర్థుడైన ప్రతినాయకుడు ఎదురైతే.. దానికి తగ్గట్టుగానే హీరో తన నటనలోని వైవిధ్యం చూపించే అవకాశం దక్కుతుంది. దాంతో పాత కథలే కొత్తగా తయారవుతాయి. ఇవన్నీ సినిమాలకు మేలు చేసే అంశాలే.