సినిమాల్లో మోసగాళ్లను ఎంతో తెలివిగా చూపిస్తుంటారు. దొంగతనం జరుగుతుందనే విషయం ఆ డబ్బులు పోగొట్టుకుంటున్నవారికే తెలియదు. కానీ చివరికి ఎక్కడో ఒక చోట ఆ దొంగలే దొరికిపోతారు. అలాంటి కథలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి.
ఇప్పుడు అలాంటి కథనే టాలీవుడ్లో నిజ జీవితంలో చూసే పరిస్థితి వచ్చింది. ఓ తెలుగు నిర్మాత పెద్ద మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ముంబయికి చెందిన ప్రముఖ కార్పొరేట్ నిర్మాణ సంస్థ అతనిపై తీవ్ర క్రిమినల్ కేసులు వేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.
చిన్న సినిమాలను భారీ రేట్లకు విక్రయించిన నిర్మాత
వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఓ తెలుగు నిర్మాత తన మూడు చిత్రాలను 2022–24 మధ్యలో ఈ ప్రముఖ నిర్మాణ మరియు ఓటీటీ సంస్థకు భారీ మొత్తాలకు విక్రయించాడు. ఆ సమయంలో అంత కంటే పెద్ద బడ్జెట్లో, స్టార్ కాస్టింగ్, ప్రముఖ దర్శకులతో చేసిన మధ్య స్థాయి సినిమాలకు కూడా ఈ మూడు చిన్న సినిమాలకి వచ్చిన అంత ధర రాలేదు. ఆ నిర్మాత సినిమాల బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్స్ ద్వారానే వచ్చిందని పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఆ డీల్స్ వెనుక భారీ స్కామ్ దాగి ఉందని బయటపడింది.
కార్పొరేట్ కంపెనీలో కీలక ఉద్యోగితో కలిసి స్కామ్
సాధారణంగా ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ప్రాంతీయ భాషలకి ఒక స్థానిక వ్యవస్థని ఏర్పాటు చేస్తాయి. ఆ సంస్థలో తెలుగు విభాగం లో కీలక పదవిలో ఉన్న వ్యక్తితో ఆ నిర్మాత “గట్టి అనుబంధం “ ఏర్పరుచుకున్నాడు. సినిమా హక్కులను ఎక్కువ రేట్లకు కొనిపిస్తే కమిషన్ ఇస్తానని ఆ నిర్మాత ఆఫర్ ఇచ్చాడు. ఆ కీలక వ్యక్తి కూడా దానికి ఒప్పుకున్నాడు. కంపెనీ యాజమాన్యం తమపై ఉంచిన నమ్మకాన్ని వాడుకుని, ఇద్దరూ కలిసి కోట్ల రూపాయలను దోచుకున్నారు. నిర్మాతకు తన కంపెనీ నుంచి డబ్బులు మళ్లించగా, ఆ ఉద్యోగి భారీ కమిషన్లు తీసుకున్నాడు. 2025 ప్రారంభంలో ఆ సంస్థ నుంచి తప్పుకున్న ఆ మాజీ ప్రముఖుడు ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు హీరోకి చెందిన సంస్థలో పనిచేస్తున్నట్టు సమాచారం.
నిర్మాత క్యాంప్ నుంచే ఫిర్యాదు
సినిమాలో కానీ, జీవితంలో కానీ మోసాలు ఎప్పటికీ రహస్యంగా సాగవు – ఎక్కడో ఒక రోజు బయటపడతాయి. ఇదే స్కామ్ విషయంలోనూ అదే జరిగింది. నిర్మాత ఆ ఓటీటీ సంస్థను అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు అతని క్యాంప్‌లోనే , అతనితో కలిసి వ్యాపారం చేసి ఉన్న వ్యక్తి గమనించి, ఆధారాలతో సహా ఫిర్యాదు పంపించాడు.
దీంతో కంపెనీ సమగ్ర ఆడిట్ నిర్వహించగా, తమ మాజీ కీలక ఉద్యోగి మరియు ఆ నిర్మాత కలిసి భారీగా నిధులు దోచుకున్నారని నిర్ధారించారు.
రికవరీ కోసం మొదటి దశలో ప్రయత్నాలు
సదరు కార్పొరేట్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే ఆ వైస్ ప్రెసిడెంట్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం దోచుకున్న నిధులను రికవరీ చేసుకోవడంపై దృష్టి సారించింది.
నిర్మాత, మాజీ ఉద్యోగి ఇద్దరూ తిరిగి డబ్బులు చెల్లిస్తే కేసులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ డబ్బు తిరిగి రాకపోతే, సంస్థ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.
ఉలిక్కిపడుతున్న ఇండస్ట్రీ
ఈ ఒక్క నిర్మాత, ఒక్క వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు ఓటీటీ మార్కెట్ విస్తరించిన తర్వాత ఇలాంటి స్కాంలు ఇండస్ట్రీలో పెరిగిపోయాయి.
మల్టీనేషనల్ ఓటీటీ కంపెనీల్లో కొంతమంది అధికారులు కావాల్సినంతగా దోచేసుకుంటున్నారన్న గుసగుసలు ఉన్నాయి. అందుకే ఓటీటీ మార్కెట్లో పారదర్శకత తగ్గిందని, పరిశ్రమ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తాజా స్కామ్ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.


