తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదాలకు స్వస్తి పలికి, అభివృద్ధి పథంలో కలిసి నడవడానికి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గొంతు కలపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం. ప్రాజెక్టుల అనుమతులు, నీటి తరలింపుపై ఇద్దరు నేతలు ఒకేసారి సానుకూలంగా స్పందించడం యాదృచ్ఛికమే అయినా, అది రెండు రాష్ట్రాల రైతులకు మేలు చేసే ఒక గొప్ప సంకేతం. రాజకీయ లబ్ధి కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడం జల రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా పడిన తొలి అడుగు. కానీ ఇది ప్రకటనలతో సరి పెడితే ప్రయోజనం ఉండదు.
ప్రాజెక్టులపై వివాదాలతో అందరికీ నష్టం !
ప్రస్తుత తరుణంలో ఒకరి ప్రాజెక్టులను మరొకరు అడ్డుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు సగటు రైతు నష్టపోతాడు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులకు ఏపీ సహకారం, అలాగే ఏపీ చేపట్టే ప్రాజెక్టుల పట్ల తెలంగాణ సానుకూలత ఇప్పుడు అత్యవసరం. వివాదాలు వద్దు.. పరిష్కారాలే ముద్దు అన్న రేవంత్ రెడ్డి పిలుపునకు, సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో తప్పులేదు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు తోడైతే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
వాస్తవ దృష్టితో రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి!
రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలంటే జలాల పంపిణీలో ఒక స్పష్టమైన , ఆచరణాత్మకమైన ఒప్పందం జరగాలి. డ్యామ్‌లలో నిల్వ ఉన్న నీటిని కృష్ణా బోర్డు ( పర్యవేక్షణలో కేటాయింపుల ప్రకారం పంచుకుంటూనే, వరద జలాల వినియోగంపై వెసులుబాటు కల్పించుకోవాలి. నదులకు భారీగా వరద వస్తున్న సమయంలో, ఆ మిగులు జలాలను ఏ రాష్ట్రం ఎలాగైనా తరలించుకునేలా పరస్పర అంగీకారం కుదుర్చుకుంటే గొడవలకు తావుండదు. న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేసుకోవడం వల్ల ప్రాజెక్టులకు కేంద్ర నిధులు ఆగిపోవడమే కాకుండా, రాష్ట్రాల ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ జాప్యం వల్ల అటు సీమ రైతులు, ఇటు తెలంగాణ రైతులు ఆవేదన చెందుతున్నారు.
సముద్రంలోకి నీరు పోకుండా వాడుకోవాలి!
వృధాగా సముద్రంలోకి పోయే వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకోవడమే లక్ష్యంగా రెండు రాష్ట్రాలు ఒక అడుగు ముందుకు వేయాలి. జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం రాదు. ఇద్దరు నేతలు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తే, భవిష్యత్ తరాలకు జల సంక్షోభం లేని తెలుగు రాష్ట్రాలను అందించవచ్చు. రాజకీయ పంతాలను పక్కన పెట్టి, విభజన సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వస్తే.. జల వివాదాలు ఆగిపోతాయి.
విపక్షాలు రాజకీయం చేస్తాయి – కానీ ప్రజలు అర్థం చేసుకుంటారు!
రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా జల వివాదాలను పరిష్కరించుకుంటే.. ఈ అంశమే రాజకీయ శ్వాసగా బతికే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వివాదం చేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ విపక్ష పార్టీలు రాష్ట్రానికి అన్యాయం అని గగ్గోలు పెడతారు. తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తారు. కానీ వారి కుట్రల్ని ప్రజలు గుర్తిస్తారు. మంచి చేసే వారికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు.
