పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్ 2 నాటికి విభజన జరిగి పదేళ్లు అవుతుంది. ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఉన్న సీఎం విదేశాలకు వెళ్తున్నారు. ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలవడానికి .. రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నించే అవకాశాలు లేవు.
విభజన చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు మొదలుకుని ఆస్తులు, అప్పుల పంపిణీ వరకు పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు. షెడ్యూలు 9, 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ, విద్యుత్తు సంస్థల బకాయిలు తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి చిన్న చిన్న అంశాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. పెద్దగా మార్పేమీ లేకపోయినా ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించాల్సి ఉంది. నిజానికి జగన్ గెలిచినప్పుడు ప్రమాణస్వీకారం చేయక ముందే అన్నీ ఇచ్చేశారు. ఒక్క లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మాత్రమే ఉంది. ఇప్పుడు అది కూడా ఇచ్చేయాల్సి ఉంది. రేవంత్ సీఎం అయ్యాక.. ఢిల్లీలో తెలంగాణ భవన్ సమస్యకు ముగింపునిచ్చారు.