ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకొన్న ఫ్రాన్స్ భద్రతా దళాలు

పారిస్ లో ఉగ్రవాదుల దాడులు జరిగిన తరువాత అక్కడితో అంతా అయిపోలేదు. ఉగ్రవాదుల కోసం ఫ్రాన్స్ పోలీసులు మరియు స్వాట్ (స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌) నిఘా వర్గాలు జరిపిన అన్వేషణలో పారిస్ నగరానికి ఉత్తరాన్న గల సెయింట్ డెనిస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంటులో మరి కొంత మంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు కనుగొనడంతో భద్రతా దళాలు నిన్న తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పారిస్ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబ్బావుద్ ఆ ప్రాంతంలో దాగి ఉన్నట్లు అనుమానించారు.

భద్రతా దళాలు అక్కడికి చేరుకోగానే, ఆ సంగతి పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై ఎదురుకాల్పులు జరపారు. సుమారు ఏడు గంటల పాటు ఉగ్రవాదులకి, భద్రతా దళాలకి మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఫ్రాన్స్ భద్రతా దళాలు ఉగ్రవాదులు ఉంటున్న భవనాన్ని చుట్టుముట్టగానే ఒక మహిళా ఉగ్రవాది బయటకు వచ్చి తనను తాను పేల్చేసుకొని ఆత్మాహుతి దాడికి ప్రయత్నించింది. ఆ ప్రేలుడు దాటికి చుట్టూ పక్కల ఇళ్ళ కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కానీ ఆ దాడిలో మరొక ఉగ్రవాది తప్ప మరెవరూ చనిపోలేదని సమాచారం.

పోలీసులు ఐదుగురు వ్యక్తులని సజీవంగా పట్టుకోగలిగారు. వారిలో ముగ్గురు ఉగ్రవాదులని గుర్తించారు. మిగిలిన ఇద్దరూ ఎవరో ఇంకా తెలియవలసి ఉంది. ఆ ఉగ్రవాదులకు ఫ్లాట్ ఇచ్చిన ఫ్లాట్ యజమానిని మరొకరిని పోలీసులు అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. స్వాట్ టీమ్ కి అందిన సమాచారం ప్రకారం ఆ భవనంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు మళ్ళీ పారిస్ నగరంపై మరోమారు దాడి చేయడానికి సరయిన సమయంకోసం వేచి చూస్తున్నట్లు కనుగొన్నారు. ఆ విషయం సకాలంలో గుర్తించి ఉగ్రవాదులను కొందరిని మట్టుబెట్టి మరికొందరి సజీవంగా పట్టుకోవడంతో మరో పెను దుర్ఘటన జరుగకుండా నివారించగలిగారు. పారిస్ నగరంపై జరిగిన దాడుల ప్రధాన సూత్రధారి అబ్దెల్ హమీద్ అబ్బావుద్ నిన్న జరిగిన ఎదురు కాల్పులలో చనిపోయాడా లేక తప్పించుకొని పారిపోయాడా? అనే విషయం ఇంకా తేలవలసి ఉంది. అతను తమ అదుపులో లేదని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్కొయిస్ మోలిన్స్ ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com