టెస్లా కార్లు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ తొలి సారిగా సేల్స్ ఔట్లెట్లను ప్రారంభిచింది. ముంబైలో మొదటి ఔట్ లెట్ ప్రారంభమయింది. గతంలో కొంత మంది టెస్లా కార్లను దిగుమతి చేసుకున్నారు కానీ నేరుగా ఇండియాలో అమ్మకాలు జరపడం మాత్రం ఇదే ప్రథమం. ప్లాంట్ పెట్టకపోతే అమ్మకాలకు అవకాశం ఇచ్చేది లేదని చెబుతూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు అవకాశం కల్పిచింది. ప్లాంట్ గురించి క్లారిటీ రాలేదు.
టెస్లా అంటే ఎందుకు క్రేజ్ అంటే.. సెల్ఫ్ డ్రైవింగ్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో ఓ విప్లవాన్ని టెస్లా తీసుకు వచ్చింది. ఎలక్ట్రిక్ కార్లు, దాని ఫీచర్స్ సెకండరీనే. ఇప్పుడు ఇండియాలో టెస్లా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కాదు. భారతదేశంలో ప్రస్తుత రోడ్డు రవాణా చట్టాలు సెల్ఫ్ డ్రైవింగ్ కు అనుమతి ఇవ్వవు. టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సాఫ్ట్వేర్ లెవల్ 2+ ఆటోమేషన్‌ను అందిస్తుంది. ఇంకా భారత రోడ్లపై ఉపయోగం కోసం ఆమోదం పొందలేదు.
ఒక వేళ అనుమతి ఇచ్చినా భారత రోడ్లపై ఉండే పరిస్థితుల వల్ల టెస్లా ఆటోపైలట్ లేదా FSD సాంకేతికతను అమలు చేయడం అసాధ్యం. ఈ సాంకేతికత ప్రధానంగా స్పష్టమైన రోడ్డు గుర్తులు, నిర్మాణాత్మక రోడ్లపైనే సాధ్యముతుంది. టెస్లా FSD సిస్టమ్ కెమెరా-ఆధారిత విధానంపై ఆధారపడుతుంది. హై-డెఫినిషన్ మ్యాపింగ్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో లెవల్ 1, లెవల్ 2 ఆటోమేషన్ కొన్ని కార్లలో అందుబాటులో ఉన్నాయి, కానీ ఇవి పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కాదు. భారత్ లో పూర్తి స్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులోకి రావాలంటే.. కార్లలో ఉపయోగించే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందాలి.. లేకపోతే భారత రోడ్డు మౌలిక సదుపాయాలు ప్రపంచస్థాయికి ఎదగాల్సి ఉంది.