తిరుపతి సభలో తెదేపాని ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీలో చాలా మంది నేతలు ఘాటుగా స్పందిస్తూనే ఉన్నారు. “మీరు కేంద్రప్రభుత్వం అంటే భయపడనప్పుడు, మీలో ఏ లోపాలు లేనప్పుడు ప్రత్యేక హోదా కావాలని గట్టిగా నిలదీసి ఎందుకు అడగటం లేదు?” అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నకి ఆయన జవాబిస్తూ “నా మీద ఎటువంటి కేసులు లేవు. నా జీవితంలో ఎవరికీ భయపడింది లేదు. కానీ నేను భయపడుతున్నానని ఎవరో చెప్పారని పవన్ కళ్యాణ్ అన్నారుట. ఏమి తమ్ముళ్ళు…నేనెప్పుడైన ఎవరికైనా భయపడ్డానా?” అని ఒక సభలో అడిగారు. ఆయన భయపడ్డారో లేదో ప్రజలందరికీ తెలుసు. అది ప్రజలకి అనవసరం కూడా. కానీ ‘ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు గట్టిగా నిలదీసి అడగడటం లేదు?’ అనే పవన్ కళ్యాణ్ ప్రశ్నకి ఆయన జవాబు చెప్పనేలేదు.
పవన్ ప్రశ్నకి అనకాపల్లి తెదేపా ఎంపి అవంతీ శ్రీనివాస్ జవాబిస్తూ “గట్టిగా అంటే…ఏరా మోడీ… అంటూ అడగాలా? ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రిని ఆవిధంగా అడుగుతారా? పవన్ కళ్యాణ్ కి మెచ్యూరిటి లేదు అందుకే నోటికి వచ్చినట్లు ఏదో మాట్లాడుతున్నారు,” అని అన్నారు.
తెదేపా రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ ఇంకా దారుణంగా స్పందించారు. “ఇదే తమిళనాడులో ముఖ్యమంత్రి లేదా ఎంపిల గురించి ఎవరైనా ఇలాగ మాట్లాడి ఉంటే జయలలిత వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టించి లోపల పడేయించి ఉండేది. పవన్ కళ్యాణ్ ఇంతకాలం కుంభకర్ణుడులాగ నిద్రపోయి ఇప్పుడు హటాత్తుగా మెలకువ వచ్చి నోటికి వచ్చినట్లు ఏదేదో వాగుతున్నాడు. ప్రత్యేక హోదా గురించి స్పీచులు ఇవ్వడం కాదు దాని కోసం ఏమి చేస్తారో ఏవిధంగా సాధిస్తారో పవన్ కళ్యాణ్ చెప్పాలి. జనసేన పార్టీకి కూడా ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే పడుతుంది,” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక్కసారి ప్రశ్నిస్తేనే తెదేపా నేతలు అందరూ ఇంతగా కంగారుపడుతూ ఎదురుదాడి చేస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ మొదటి నుంచే ఇదే విధంగా ప్రశ్నిస్తూ ఉండి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలోనైనా అడుగు ముందుకు వేయగలిగేదా? ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని ఇంతకాలం అందరూ విమర్శలు చేసేవారు. ఇప్పుడు మాట్లాడితే భయపడుతున్నారు. ఆ భయంతో ఎదురుదాడి చేస్తున్నారు కూడా.
ప్రత్యేక హోదా గురించి జగన్ మాట్లాడితే తప్పు లేదు. తెదేపా, కాంగ్రెస్ ఎంపిలు మాట్లాడితే తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ తప్పుగా కనిపిస్తోంది? అలాగ మాట్లాడినందుకు వీలైతే పవన్ కళ్యాణ్ కాళ్ళు చేతులు విరిచేసి జైల్లో పడేయాలననంత కసి వ్యక్తం చేస్తున్నారు. రెండున్నరేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు ప్రత్యేక హోదా సాధించలేకపోయిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ న్ని విమర్శించే హక్కు ఉందా? అసలు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి ప్రత్యేక హోదా సాధించుకొందామని అనకుండా ‘ఆయన కాళ్ళు చేతులు విరిచేస్తే బాగుంటుంది…ఆయన పార్టీకి ప్రజారాజ్యానికి పట్టిన గతే పడుతుంది’ అని శాపనార్ధాలు పెట్టడం ద్వారా వారు ప్రజలకి ఎటువంటి సంకేతాలు పంపిస్తున్నారో వారికి తెలుసా?
పవన్ కళ్యాణ్ ఇంకా పోరాటం మొదలుపెట్టక మునుపే దానిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే భావన ప్రజలకి కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించలేనివారు దాని గురించి గట్టిగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడితే ప్రజల దృష్టిలో వాళ్ళే ఇంకా చులకన అవుతారు. తమ మాటలు తెదేపాకి మేలు చేస్తాయా..కీడు చేస్తున్నాయా అని ఓమారు ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిది.