జయలలిత అంటే.. ఓ పేరు కాదు. ఓ వ్యక్తి కాదు. ఓ తరం. ఓ ఆవేశం. ఓ ఉధృతి. ఓ ఉప్పెన. ఓ అనామకురాలు.. ఓ రాష్ట్రానికి అమ్మగా మారిన ప్రయాణం. అనుమానాల్ని, సవాళ్లని, సంక్షోభాల్ని… మెట్లుగా చేసుకుని, సింహాసనాన్ని అధిష్టించిన అద్భుతమైన ప్రయాణం. ఆ కథే.. ఆమె కథే.. ఇప్పుడు `తలైవి`గా రాబోతోంది. జయలలిత బయోపిక్.. `తలైవి`. విజయ్ దర్శకత్వం వహించారు. 4 సార్లు జాతీయ అవార్డు విజేత అయిన.. కంగనారనౌత్ జయలలితగా కనిపించబోతోంది. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ లాంటి చిత్రాలకు కథ అందించిన… విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయితగా పనిచేశారు. ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు.
మూడు నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ ఇది. బహుశా ఈమధ్య కాలంలో ఇంత నిడివి ఉన్న ట్రైలర్ రాలేదేమో..? ట్రైలర్ అడుగడుగునా.. జయలలిత జీవితంలోని ఎత్తుపల్లాల్ని క్లుప్తంగా పరిచయం చేశారు. కథానాయికగా ఎదిగిన తీరు, రాజకీయ ప్రవేశం, ఆటు పోట్లు.. ఇవన్నీ ఆవిష్కరించేశారు. ముఖ్యంగా తమిళనాట అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ ని.. ఉద్వేగభరితంగా చూపించారు. `ఆ మహాభారతానికి ఇంకో పేరుంది.. జయ` అని కంగనా రనౌత్ తో చెప్పించడం…. జయ అభిమానులకు గూజ్ బమ్ మూమెంట్ అని చెప్పుకోవాలి.
“నన్ను అమ్మగా చూస్తే… నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఆడదానిగా చూస్తే…“ అనే డైలాగ్ దగ్గర ట్రైలర్ ని కట్ చేశారు. జయలలిత జీవితంలో దాదాపుగా అన్ని కోణాల్నీ ఈ బయోపిక్ లో సృశించారన్న సంగతి అర్థమవుతూనే ఉంది. జయగా…. కంగనా మరోసారి విశ్వరూపం చూపించేసింది. అరవింద్ స్వామి, సముద్రఖని, మధుబాల లాంటి నటీనటులు `తలైవి` బలం. తెలుగులో ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చెప్పలేం గానీ, తమిళనాట పూనకాలు తెప్పించే సినిమా అవుతుందేమో అనిపిస్తోంది. పైగా అక్కడ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ దగ్గర పడింది. కాబట్టి.. తప్పకుండా తమిళ చిత్ర, రాజకీయ రంగంలో సంచలనాలకు ఇది కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది.