‘గేమ్ ఛేంజర్’ సినిమా సమయంలో తమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానుల్ని హర్ట్ చేశాయి. `గేమ్ ఛేంజర్లో సరైన స్టెప్పులు వేయకపోవడం వల్లే పాటలు జనాల్లోకి వెళ్లలేద`న్న తమన్ కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. చరణ్ డాన్సులు సరిగ్గా చేయలేకపోవడం ఏమిటి? నువ్వే సరిగ్గా ట్యూన్లు ఇవ్వలేదంటూ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీనిపై తమన్ మళ్లీ స్పందించారు. తెలుగు 360 కి ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో అప్పటి గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు.
”హుక్ స్టెప్పులు ఉంటేనే పాటలు జనాల్లోకి వెళ్తాయన్న మాటపై కట్టుబడి ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమాలో కథలెన్నో చెప్పాయి.. పాట గురించి ఎవరికి తెలుసు? కానీ ఆ హుక్ స్టెప్ తో పాట జనంలోకి వెళ్లిపోయింది. ‘అల వైకుంఠపురం’లో బుట్ట బొమ్మ పాట బన్నీ స్టెప్ వల్లే అంత పాపులర్ అయ్యింది. రామ్ చరణ్ గొప్ప డాన్సర్. ‘నాయక్’లో లైలా ఓ లైలా పాటలో అద్భుతమైన స్టెప్పులు వేశారు. అలాంటి గొప్ప డాన్సర్ ని వాడుకోలేకపోయారన్నదే నా బాధ. అక్కడ ఉన్నది చరణ్ రా.. వాడుకోండ్రా అని చెప్పా. నా కోపమంతా కొరియోగ్రాఫర్ల మీదే.. చరణ్ అభిమానులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొన్నారు” అని ఆవేదన వెళ్లగక్కారు.
‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి తాను ఎంతగా కష్టపడ్డారో… ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తమన్. ”మచ్చ. మచ్చ. పాటని రెండేళ్ల పాటు కడుపులో పెట్టుకొని కాపాడుకొన్నాను. ఈ సినిమా నుంచి రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లలేదు. దిల్ రాజు ఎంత ఇస్తే… అంతా… మ్యూజిక్కే ఖర్చు పెట్టా. ఈ విషయం దిల్ రాజు గారికీ తెలుసు. ఇది శంకర్ గారి సినిమా. అందుకే రెక్కలు విప్పుకొని మరీ కష్టపడ్డా” అన్నారు తమన్. కానీ ఫలితం మాత్రం రాలేదు. అదే ఆయన బాధ.