ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఈ సంస్కృతి పల్లెటూర్లకూ పాకింది. ఈ నేపథ్యంలో ఓ సినిమా వస్తోంది. అదే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. తిరువీర్ కథానాయకుడిగా నటించాడు. టీనా శ్రావ్య హీరోయిన్. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నవంబరు 7 విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
కథ, కథనం, పాత్రలు, అందులోంచి వచ్చే వినోదం అంతా సహజంగా కుదిరినట్టు అనిపిస్తోంది. పల్లెటూరి వాతావరణం, అక్కడి రకరకాల మనుషులు, వాళ్ల మనస్తత్వాలూ అన్నీ ఈ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. తిరువీర్ నటన, ఆ పాత్ర చిత్రణ మరింత నేచురల్ గా తీర్చిదిద్దారు. సందర్భానుసారంగా వచ్చే వినోదమే ఈ సినిమాకు ప్రధాన బలం. హీరో ఓ ఫొటోగ్రాఫర్. ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఆరి తేరినవాడు. తను చేసిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన చిప్ మాయం అయిపోతుంది. ఆ తరవాత జరిగే పరిణామాలే ఈ సినిమా కథ. ’90’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకొన్న మాస్టర్ రోహన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా అల్లరి బాగానే చేసినట్టు కనిపిస్తోంది.
ఈనెల 7న బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఎదురు కానుంది. ‘గాళ్ ఫ్రెండ్’ సినిమా ఆరోజే వస్తోంది. రష్మిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా అది. సుధీర్ బాబు ‘జటాధర’ కూడా అదే రోజు వస్తోంది. ఈ రెండు సినిమాలతో పోటీ పడి, ‘ప్రీ వెడ్డింగ్..’ ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.
TheGreatPreWeddingShow
