మిషన్ 90 డేస్, సైనైడ్, ది టెర్రరిస్ట్, మద్రాస్ కేఫ్, కుట్రపత్రికై.. ఇవన్నీ ఇప్పటివరకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపధ్యంలో వచ్చిన సినిమాలు. ఇప్పుడు దర్శకుడు నాగేశ్ కుకునూర్ అనిరుధ్య మిత్రా రాసిన “90 డేస్” ఆధారంగా ”ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్” పేరుతో ఏడు ఎపిసోడ్ల ఒక సుదీర్ఘమైన వెబ్ సిరీస్ తీశారు. సోనీ లీవ్ ఓటీటీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌లో ఎలాంటి అంశాలు వున్నాయి? రాజీవ్ గాంధీ హత్యపై ఈ సిరీస్ ఇప్పటివరకు తెలియని కొత్త కోణాలు చూపించిందా?
మే 21, 1991న తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కలిచివేసింది. హంతకులను యుద్ధప్రాధిపదికన పట్టుకోవడానికి డీఆర్ కార్తికేయన్ (అమిత్ సియాల్)ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చీఫ్‌గా నియమిస్తారు. ఆయన దేశం నలుమూలల నుంచి టాప్ ఆఫీసర్లను టీంలో చేర్చుకుంటాడు. ఆ తర్వాత దర్యాప్తు ఎలా జరిగింది? హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేది మిగతా సిరీస్.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దేశ చరిత్రలో ఇంకా పచ్చిగానే ఉంది. రాజకీయాలపై అవగాహన వున్నవారికి కూడా ఆ కేసు గురించి వివరంగా చాలా విషయాలు తెలియవు. అసలు రాజీవ్‌ని ఎందుకు హత్య చేశారు? శ్రీలంకలోని ఎల్టీటీఈకి రాజీవ్ గాంధీపై ఆగ్రహం. కారణం… శ్రీలంకలో తమకు సొంత దేశం కావాలని వాళ్లు సివిల్ వార్ చేస్తున్నారు. 1987లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌ను రాజీవ్ శ్రీలంకకి పంపారు. తర్వాత ఆయన ఇండో-శ్రీలంక ఒప్పందానికి మద్దతిచ్చారు. ఇవన్నీ ఎల్టీటీఈకి నచ్చలేదు. తమ ఆశయాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న రాజీవ్‌ను అడ్డుతొలగించేందుకు ఎల్టీటీఈ రాజీవ్ హత్యకు కుట్ర చేసింది. ఈ అసాసినేషన్లో రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది.
దర్శకుడు నాగేశ్ కుకునూర్ కేసులో సంచలనాలు, ట్విస్టుల జోలికి వెళ్లలేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని వీలైనంత వేగంగా రివీల్ చేసేందుకు ప్రయత్నించాడు. రాజీవ్‌పై బాంబు దాడి సన్నివేశంతోనే మొదలుపెట్టి రాజీవ్ హత్య, సిట్ ఏర్పాటు, దాడికి కారణాలు, హంతకులు, ఎల్టీటీఈ నేపథ్యం… ఇవన్నీ కూడా తొలి ఎపిసోడ్‌లోనే చూపించేశాడు. మిగతా ఆరు ఎపిసోడ్లు సిట్ దర్యాప్తు, హత్యకు మాస్టర్ మైండ్ అయిన శివరాసన్‌ను హంట్ చేసే తీరు చాలా రియలిస్టిక్ అప్రోచ్‌లో చూపించడం బాగా కుదిరింది. దేశాన్ని కుదిపేసిన ఘటనలో హై వోల్టేజ్ ట్రీట్మెంట్కు ఛాన్స్ ఉంది. కానీ దర్శకుడు ఆ ఛాన్స్ తీసుకోలేదు. అసలైన దర్యాప్తు ఎలా సాగుతుందో అంతే నిదానంగా ఉంటుంది. థ్రిల్ కోసం పేస్ పెంచడం ఉండదు.
సిరిస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్లు. ఒకొక్క ఎపిసోడ్ నిడివి 40నిమిషాలకు పైనే. దర్శకుడు ఎక్కడా వివాదాస్పద విషయాల జోలికి వెళ్లలేదు. పొలిటికల్ లింకులు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, పాలిటికల్ లీడర్ల ప్రమేయం లాంటి అంశాలను పూర్తిగా దూరంగా ఉంచాడు. సిరీస్ చూస్తున్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి. శ్రీపెరుంబుదూర్ మీటింగ్ సెక్యురిటీలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. వాటిని పైపైన మాత్రమే చూపించాడు. ఇక శివరాసన్ గ్యాంగ్‌ను సూపర్ విలన్లా ఏం చిత్రీకరించలేదు. అలాగే వారిని బాధితులా చూపలేదు. ”ఒకడికి హీరో మరొకడికి విలన్” అనే డైలాగ్‌తో శివరాసన్ పాయింట్ ఆఫ్ వ్యూను చూపించే ప్రయత్నం చేశాడు. సిరీస్ దాదాపు శివరాసన్ వేటతోనే నడుస్తూ ఉంటుంది. తాను ప్రతిసారీ తప్పించుకునే విధానం ఎంగేజింగ్‌గా చిత్రీకరించారు. సైనైడ్ చుట్టూ నడిపిన కొన్ని సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే ఎయిర్పోర్ట్ సీక్వెన్స్ కూడా బావొచ్చింది. మొత్తం 90 రోజుల వేటలో శివరాసన్‌ను చేరుకునే వరకూ ఎక్కడా లింక్ తెగిపోకుండా దర్యాప్తును చూపించారు. ఈ ప్రాసెస్ కాస్త సుదీర్ఘంగా ఉంటుంది.
డీఆర్ కార్తికేయన్‌గా అమిత్ సియాల్, మిగతా అధికారులు షాహిల్ వైద్, భగవతి పెరుమాళ్, గిరీష్ శర్మ, అభిషేక్ శంకర్ — వీరంతా పాత్రల్లో ఒదిగిపోయారు. LTTE మాస్టర్ మైండ్ శివరాసన్ పాత్రలో షఫీక్ ముస్తఫా జీవించేశాడు. టెక్నికల్ గా సిరిస్ బావుంది. అలనాటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి శక్తిమేర ప్రయత్నించారు. అంబాసిడర్ కార్లు, రొటరీ ఫోన్లు, బాక్స్ టీవీలు, ప్రింటెడ్ ఫోటోలు… ఇవన్నీ ఆ కాలపు వాతావరణాన్ని చూపించాయి. హిందీ వెర్షన్ ఆడియోలో చాలా వరకు తమిళ్ వుంటుంది. తమిళ్ అర్ధం కాకపొతే తెలుగులో చూడటమే బెటర్.
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ కోసం ‘ది హంట్: రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ చూడటం మొదలుపెడితే మాత్రం బోర్ ఫీల్ అవుతుంది. ఇది రాజకీయాలను, సివిల్ వార్‌ను, సిద్ధాంతాలను, సిస్టమ్‌లో ఉండే లోపాలను, అలనాటి పరిస్థితులను చూపించే రియలిస్టిక్ డ్రామా. దేశ చరిత్రలో జరిగిన ఒక షాకింగ్ ఘటన తాలూకు దర్యాప్తును సహజంగా చూపించాడు దర్శకుడు. ఈ సిరీస్‌లో టచ్ చేసిన ఓ పాయింట్ ఇప్పటికీ రిలవెంట్‌గానే ఉంది. ఈ కేసు విచారణలో అధికారులకు ఎదురైన పెద్ద సవాల్… రెఫ్యూజీ ఎవరు? ఎల్టీటీఈ ఎవరు? వాళ్లను ఎలా గుర్తించాలి? ఇప్పటికీ ఇది పెద్ద సవాలే.