అమెరికాలో కన్నడిగుడు నాగమల్లయ్యను ఓ క్యూబన్ వ్యక్తి తలనరికి చంపడం.. అటు అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీని.. ఇటూ ఇండియాలోని ఇండియన్స్‌ను కూడా ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. గతంలో చాలా మంది దొంగలు, దోపిడీదారులు.. దుకాణాల్లో, గ్యాస్ స్టేషన్ల వద్ద..రోడ్డు మీద కూడా భారతీయుల్ని కాల్చి చంపారు. కానీ అప్పుడు ఎప్పుడూ రాని చర్చ ఇప్పుడు జరుగుతోంది. నాగమల్లయ్య హత్యపై అమెరికన్ సమాజం సరిగ్గా స్పందించలేదని కొంత మంది అంటున్నారు. ముఖ్యంగా భారత్ నుంచి కొంత మంది ఆ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నాగమల్లయ్య హత్య విషయంలో అమెరికా వేగంగా స్పందించింది. జాతి వివక్ష అసలు చూపించలేదు.
ఓ ఘోర నేరస్తుడి చేతిలో హత్య
క్యూబాకు చెందిన వ్యక్తి అమెరికాకు వచ్చాడు. అతను డిపోర్టేషన్ లిస్టులో ఉన్నాడు. కానీ పంపలేకపోయారు. అతను వరుసగా నేరాలు చేస్తున్నాడు. చాలా తీవ్రమైన నేర మనస్థత్వం ఉన్న వ్యక్తి. వాషింగ్ మెషిన్ వాడకం దగ్గర వచ్చిన వివాదంతో నాగమల్లయ్యను హత్య చేశాడు. ఆ స్థానంలో భారతీయుడైన నాగమల్లయ్యే కాదు…స్వయంగా అమెరికన్ ఉన్నా .. ఆ వ్యక్తి అదే పని చేస్తాడు. ఎదుట ఉన్న వారి జాతిని ఉద్దేశించి నేరాలు చేయడు.. తన నేర మనస్థత్వంతో చేయాలనుకున్నది చేస్తాడు. అతడికి క్యాపిటల్ పనిష్మెంట్ ఖాయమని అంచనా వేస్తున్నారు.
వేగంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం
అమెరికా యంత్రాంగం వేగంగా స్పందించింది. నిందితుడ్ని పట్టుకుంది. అతడితో నేరం అంగీకరిచేలా చేసింది. ఇక్కడ బెయిళ్లు, వాయిదాలతో కేసు సాగదు. ఇంత పర్ఫెక్ట్ గాఉన్నందున .. కొన్ని వారాల్లోనే కేసు తేలిపోతుంది. అంతే కాదు నాగమల్లయ్య కుటుంబానికి అధికార యంత్రాంగం కూడా అండగా ఉంది. వారికి రక్షణ కల్పించారు. కావాల్సిన సాయం అందించే ఏర్పాట్లు చేశారు. అలాగే టెక్సాస్ ఇండియన్ సమాజం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంది. ఘోరం జరిగినప్పుడు.. ఓ కుటుంబానికి మనోధైర్యం ముఖ్యం. ఆ విషయంలో నాగమల్లయ్య కుటుంబానికి లోటు రాకుండా చేయడానికి ప్రయత్నించారు.
అమెరికాలో భారతీయులపై వివక్ష ప్రచారమే
అమెరికాలో భారతీయుల్ని కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా ప్రతీ దానికి మతం తీసుకువచ్చి కొంత మంది భారతీయులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్లే సమస్యలు వస్తున్నాయి. హిందూత్వంపై అమెరికాలో ఎలాంటి వివక్ష లేదు. అందుకే ఆలయాలను స్వేచ్చగా నిర్మించుకుని పూజలు చేసుకుంటున్నారు. అందరి మత విశ్వాసాలను గౌరవిస్తారు. ఏదైనా జరిగితే.. అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే వివక్షే అనుకోవడం ప్రమాద కరం. ప్రతీ దానికి జాతి వివక్ష, హిందువులపై వ్యతిరేకత వంటి పదాలు వాడి..అమెరికాలో ఉంటున్న ఇండియన్లను టార్గెట్ చేసేలా చేయడం మూర్ఖత్వం.