టికెట్ రేట్ల పెంపుదల పంచాయితీ రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వాలు చిత్రసీమని చిన్న చూపు చూశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాక.. పరిస్థితులు మారతాయి అంటే, మరో కోణంలో టాలీవుడ్ పై పగ పట్టేశాయి. ఏపీ సంగతి పక్కన పెడితే… తెలంగాణలో రేవంత్ సర్కారు టాలీవుడ్ కు సానుకూలంగానే ఉండేది. కానీ సంధ్య ధియేటర్ ఘటన తరవాత పరిస్థితులు మారాయి. టికెట్ రేట్లు, ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ సర్కారు మొండిగా వ్యవహరించింది. టికెట్ రేట్ల పెంపుదల లేదు… అంటూ అసెంబ్లీలోనే సీఎం ప్రకటించేశారు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. రేవంత్ కూడా మెత్తబడ్డారు. తెలుగు సినిమా పక్షాన ఉంటా అంటూ ప్రకటించారు. అయితే ఇదీ కొంతకాలమే. ఈమధ్య తెలంగాణ హైకోర్టు ఈ విషయంపై కఠినమైన తీర్పులు వెలువరించింది. తాజాగా టికెట్ రేట్లు పెంచాలంటే, కనీసం 90 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. ఇది నిర్మాతకు మరో గుది బండ.
టికెట్ రేట్ల పెంపు విషయమై నన్ను సంప్రదించవద్దు అంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ప్రకటించేశారు. దానికి తోడు.. ఈ కోర్టు తీర్పు ఒకటి. హై కోర్టు ఈస్థాయిలో స్పందించిన తరవాత టికెట్ రేట్ల పెంపుదల విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించడానికి నిర్మాతలు ధైర్యం చేయరు. మరీ అంతగా కావాలంటే 90 రోజుల నిబంధన అనుసరించి నడుచుకోవాల్సిందే. కానీ అది దాదాపు అసాధ్యం.
చిత్రసీమ ఏమీ ఒక పద్ధతిలో నడిచే రంగం కాదు. రిలీజ్ డేట్ల విషయంలో చాలా మతలబులు, లెక్కలు ఉంటాయి. ఓ సినిమా రిలీజ్ డేట్ మూడు నెలల ముందే ప్రకటించి, దానికి తగ్గ సన్నాహాలు చేసుకోవడం కష్టమే. ఒకవేళ ప్రకటించినా, అనుకొన్న సమయానికి సినిమా వస్తుందన్న నమ్మకం ఉండదు. రిలీజ్ డేట్ చివరి నిమిషంలో మార్చుకొన్న సందర్భాలెన్నో. అలా మార్చుకొన్న ప్రతీసారీ.. సదరు నిర్మాత కొత్త జీవో కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రదక్షణాలకు బదులు టికెట్ రేట్ల గురించి ఆశించకుండా, మామూలు రేట్ల కే సినిమాని విడుదల చేయొచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భవిష్యత్తులో నిర్మాతలెవరూ ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకపోవొచ్చు అనిపిస్తోంది.
రాబోయే పెద్ద సినిమాల్లో ‘పెద్ది’ ముందు వరుసలో ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 27న ఈ సినిమా విడుదల చేయాలి. అంటే.. ఈపాటికే టికెట్ రేట్ల విషయంలో అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవడం కుదరదు. అంటే పెద్ది సినిమాని నార్మల్ రేట్లకే ప్రదర్శించాలి. ఆ సినిమా బడ్జెట్ కు నార్మల్ రేట్లతో సినిమాని ఆడించుకోవడం గిట్టుబాటు అవుతుందా అనేది పెద్ద ప్రశ్న. పెద్ది కే కాదు, రాబోయే అన్ని పెద్ద సినిమాలకూ ఇదే సమస్య. తెలంగాణలో ఒక రేటు, ఆంధ్రాలో మరో రేటు ఉంటే అది ఏ రూపంలోనూ సమంజసమైన వ్యవహారం కాదు. కాబట్టి.. ఆంధ్రాలోనూ పెంపుదల కు ఛాన్స్ చాలా తక్కువ. మరి ఈ రేట్లు.. నిర్మాతలకు ఓకేనా? లేదంటే ఈ గొడవలన్నీ పక్కన పెట్టి, బడ్జెట్లు తగ్గించుకొని, సినిమా వ్యయాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిదా? అంతా కాదంటే.. టికెట్ రేట్ల విషయంలో శాశ్వతమైన జీవోని తీసుకొచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం మంచిదా? ఈ విషయమై నిర్మాతలంతా కూర్చుని, ఆలోచించుకోవాల్సిన అసవరం… చాలా ఉంది.
