తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులతో పాటు ఓ ఆర్డినెన్స్ కూడా ఇప్పుడు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. వాటిని ఆమోదించడం లేదని రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ప్రధానిగా మోదీని దించేసి రాహుల్ ను గెలిపించుకుని బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అంటే చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ కు స్పష్టత ఉన్నట్లే.
అయినా ఇప్పుడు కేబినెట్ లో చర్చించి జీవో జారీ చేయాలని నిర్ణయించడం పూర్తిగా రాజకీయ కోణమేనని భావిస్తున్నారు. బిల్లులు, ఆర్డినెన్స్ ఆమోదం పొందకముందే జీవో జారీ చేయాలన్న నిర్ణయం చట్టపరంగా నిలబడదు. ఈ జీవో జ్యుడీషియల్ సమీక్షలో కొట్టివేతకు గురవడం ఖాయం. ఈ జీవో ఆధారంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ జారీ చేస్తే.. ఆ ప్రక్రియ కూడా కోర్టుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సెప్టెంబర్ నెలాఖరులోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. జూలై నెలాఖరు నాటికే రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. కానీ అసలు సమస్య రిజర్వేషన్లే కాబట్టి ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇప్పుడు న్యాయపరంగా నిలబడని జీవోతో తెరపైకి వస్తున్నారు. రాజకీయ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నా.. అనూహ్యంగా జీవోతో రాజకీయం మారుస్తున్నారు.
