బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో మాజీమంత్రి హరీష్ రావు అకస్మాత్తుగా మీడియా ముంగిటకు వచ్చారు. తనకు కేసీఆర్ మాటే శాసనం అని, ఆయన బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ ను వీడుతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ ప్రచారాన్ని ఖండించారు.
నిజానికి , ఇట్లాంటి ప్రచారం గతంలో చాలాసార్లు జరిగింది. కానీ, ఏనాడూ హరీష్ రావు మీడియా ముంగిటకు వచ్చి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మీడియా ముంగిటకు వచ్చి వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా పార్టీపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని జరుగుతున్న ప్రచారం పతాక స్థాయికి చేరుకోవడంతో హరీష్ రావు వివరణ ఇవ్వక తప్పలేదనే వాదనలూ వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నియామకంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతున్న టైంలో హరీష్ ఈ వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ నియామకం జరిగితే కేసీఆర్ మరోసారి పార్టీ అధ్యక్షుడు కావడం ఖాయం. కానీ , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరోసారి కేటీఆర్ కే పగ్గాలు అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం బీఆర్ఎస్ అధికారంలో లేదు. పార్టీలో హరీష్ రావుకు ప్రాధాన్యత కూడా దక్కడం లేదు. మునుపటి ఆదరణ దక్కాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు పగ్గాలు అప్పగిస్తే బాగుంటుంది అనేది హరీష్ వర్గం నేతల ఆలోచన. ఈ విధమైన వ్యూహంతోనే కేసీఆర్ అడుగు జాడల్లో నడిచే నేతను అంటూ హరీష్ వివరణ ఇచ్చుకున్నారని టాక్ నడుస్తోంది.