కొన్ని వారాలుగా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. సెప్టెంబరులో వరుస విజయాలతో జోష్ వచ్చింది. అక్టోబరులో ‘కాంతార 2’ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. దీపావళికి వచ్చిన సినిమాల వసూళ్లు కూడా కాస్త బాగానే కనిపించాయి. ఈనెలాఖరున కూడా ఈ ఊపు కొనసాగే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈనెల 31న ‘బాహుబలి ఎపిక్’ వస్తోంది. ఇది రీరిలీజ్ సినిమానే. కాకపోతే.. ఇది రాజమౌళి ప్రొడెక్ట్. రెండు భాగాల్ని కలిపి, ఒకే సినిమాగా విడుదల చేయాలన్నది మంచి ఆలోచన. దాంతో పాటు ప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఓ పెద్ద సినిమాకు ఎలాగైతే బిజినెస్ జరుగుతుందో, దానికి తక్కువ కాకుండా బాహుబలి ఎపిక్ వ్యాపారం జరిగింది. అటూ ఇటుగా రీ రిలీజ్ తో రూ.100 కోట్లు దక్కించుకోవాలన్నది టార్గెట్. 30 అర్థరాత్రి నుంచే ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ఓ రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్ షో లతో హడావుడి చేయడం అంటే మామూలు విషయం కాదు.
31న ‘మాస్ జాతర’ విడుదల కావాల్సివుంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. 31న ప్రీమియర్లు ప్రదర్శిస్తారు. 1 నుంచి సినిమా థియేటర్లలో ఉంటుంది. రవితేజ 75వ చిత్రమిది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. రవితేజకున్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా ఏమాత్రం బాగున్నా, థియేటర్లు కళకళలాడతాయి. కాకపోతే ఈ సినిమాకు మంచి బజ్ అవసరం. టీజర్ ఆకట్టుకోలేదు. పాటలూ అంతంత మాత్రమే. ట్రైలర్ పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉన్నాయి. ఈ సాయింత్రం ట్రైలర్ బయటకు వస్తుంది. మరోవైపు నాగవంశీ అండ్ టీమ్ ప్రమోషన్లపై ఫోకస్ పెట్టింది. ‘బాహుబలి ఎపిక్’ ధాటిని తట్టుకోవడం మాస్ జాతరకు కొంచెం కష్టమే. కాకపోతే.. నాగవంశీ ఏమాత్రం భయపడడం లేదు. ‘మాది కొత్త సినిమా.. వాళ్లది రీ రిలీజ్’ అనే ధోరణిలోనే ఉన్నారు. బాహుబలికి ఎలాగూ ఓపెనింగ్స్ అదిరిపోతాయి. మాస్ జాతర కూడా ఇంపాక్ట్ చూపించగలిగితే.. సెప్టెంబరుతో పాటు అక్టోబరు కూడా సంతృప్తికరమైన ఫలితాల్ని ఇచ్చినట్టే.
