నవంబరు క్యాలెండర్ ‘మాస్ జాతర’తో మొదలయ్యింది. అక్టోబరు 31నే ప్రీమియర్లు పడ్డా.. లెక్క ప్రకారం నవంబరు 1న రిలీజ్ అయినట్టే. రవితేజ సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి హడావుడీ చేయకపోయినా, ‘బాహుబలి ఎపిక్’ మాత్రం మంచి వసూళ్లు రాబట్టుకొంటోంది. ఈవారం సినిమాల హడావుడి బాగానే కనిపిస్తోంది. మూడు స్ట్రయిట్ సినిమాలతో పాటు, ఓ డబ్బింగ్ సినిమాల విడుదల కాబోతున్నాయి. అందులో రష్మిక ‘గాళ్ ఫ్రెండ్’ సినిమా కూడా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్ తో కలిసి ధీరజ్ మొగలినేని నిర్మించారు. ఈనెల 7న వస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక గట్టిగానే ప్రమోషన్స్ చేస్తోంది. సోలో హీరోయిన్ గా తన మొదటి సినిమా ఇది. రష్మిక కోసం థియేటర్లకు జనం ఎలా రాబోతున్నారు? తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత? అనేది ఈ సినిమా ఓపెనింగ్స్ తో తెలిసిపోతుంది. టీజర్ సాఫ్ట్ గా ఉన్నా, ట్రైలర్ మాత్రం చాలా హార్డ్ గా అనిపించింది. ‘డార్క్ ఎమోషన్స్ ఈ సినిమాలో చూపిస్తున్నా’ అంటున్న రాహుల్ రవీంద్రన్ స్టేట్మెంట్లు కూడా ఆకట్టుకొంటున్నాయి. మిగిలిన సినిమాల కంటే ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలు హిట్టయితే… లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు, కథలకు కొత్త ఉత్సాహం వస్తుంది.
సుధీర్ బాబు ‘జటాధర’ కూడా ఈ వారమే వస్తోంది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. హారర్, థ్రిల్లర్ జోనర్ లో ఏదో కొత్త ప్రయోగం చేసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సుధీర్ బాబు చేసిన ప్రోపర్ పాన్ ఇండియా సినిమా ఇది. ఈ తరహా కథలకు ఈమధ్య ఆదరణ బాగా లభిస్తోంది. కాస్త క్లిక్ అయినా, పాన్ ఇండియా సినిమా కాబట్టి మంచి వసూళ్లు అందే అవకాశం వుంది.
ఈవారం ఓ చిన్న సినిమా వస్తోంది. అదే ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రేక్షకుల్ని పలకరిస్తోంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా ఇది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కల్చర్ పై తీసిన సెటైరిక్ డ్రామా ఇది. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. నిజాయితీతో కూడిన ప్రయత్నం లా అనిపిస్తోంది. పైగా విడుదలకు ముందే ఓటీటీ హక్కులు అమ్ముడయ్యాయి. సినిమా చూశాక ‘జీ’ సంస్థ ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. మంగళవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్లు ప్రదర్శించాలని చిత్రబృందం భావిస్తోంది.
దీనితో పాటు తమిళ డబ్బింగ్ సినిమా ‘ఆర్యన్’ కూడా రిలీజ్కు రెడీ అయ్యింది. విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా ఇది. దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ‘రాచ్చసన్’ తరవాత విష్ణు విశాల్ ఈ జోనర్లో ఇలాంటి సినిమా చేయడం ఇదే ప్రధమం. దాంతో అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాని శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              